- మూడు గ్రూపులతో ప్లాన్ అమలు..?
- డేటా విశ్లేషణలో అనేక కొత్త కోణాలు
- రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నిర్ణయాలతో
- వాణిజ్య పన్నుల శాఖకు కోట్లలో నష్టం..!
కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ)లో ఐఐటీ విద్యార్థులతో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చేయించిన డేటా విశ్లేషణలో అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. 2017 నుంచి 2021 వరకు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఓ కన్సల్టెన్సీ విధులను నిర్వహించగా, ఈ 5 సంవత్సరాల పాటు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి మూడు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా సమాచారం. అయితే ఈ మూడు గ్రూపుల్లో ఒక గ్రూపులో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, మరొకటి అదనపు స్థాయి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లు, డివిజన్ స్థాయి అధికారులు, చివరి గ్రూపు కన్సల్టెంట్‌ను పర్యవేక్షించే ప్రొఫెసర్‌తో పాటు ఐఐటీ విద్యార్థులతో గ్రూపులను క్రియేట్ చేసి ఈ తతంగాన్ని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నడిపినట్టుగా తేలింది. ఉదయం 6 గంటల నుంచి ఈ మూడు గ్రూపులతో ఆయన చాటింగ్ చేస్తూ తన ప్లాన్‌ను ఆయన అమలు చేసినట్టుగా తెలిసింది.
నాలుగు భాగాలుగా పన్ను వసూలు
అయితే అప్పటి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి రూపొందించిన ప్రణాళికలో భాగంగా కొందరు అధికారులు, ఐఐటీ విద్యార్థులు కమర్షియల్ ట్యాక్స్ డేటాను క్రోడీకరించి దానిని విశ్లేషించే వారని తెలిసింది. దీంతోపాటు పన్నుల వసూళ్లకు సంబంధించి నాలుగు భాగాలు పన్నులను వసూలు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే ఇందులో ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి, సెస్‌ల పేరుతో నాలుగు విభాగాలుగా పన్నులను వసూలు చేయాలని అప్పటి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టిలను మాత్రమే అమలు చేయగా మరో రెండింటిని ఐజిఎస్‌టి, సెస్‌లను వ్యాపారుల నుంచి వసూలు చేయకుండా ఆ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అడ్డుకున్నట్టుగా తెలిసింది. వాటిని అమల్లోకి తీసుకొస్తే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన అధికారులను హెచ్చరించినట్టుగా తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయం కోల్పోయినట్టుగా సమాచారం.
80 వేల మందికి నోటీసులు
అయితే రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచనల మేరకు ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి చెల్లించే వ్యాపారులకు 2017 నుంచి 2021 సంవత్సరానికి గాను వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సుమారుగా 80 వేల మందికి నోటీసులు ఇవ్వగా వారి నుంచి సుమారుగా రూ.700 కోట్లు వసూలు అయినట్టుగా తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎస్‌జిఎస్టీని చెల్లించే వ్యాపారులు రెండున్నర లక్షల మంది ఉన్నట్టుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందులో కూడా తమ అనుకూలమైన వారికి నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు మరికొంతమంది ఉద్యోగులు భారీగా లబ్ధిపొందినట్టు తెలిసింది.
ఐజిఎస్‌టి అమల్లో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదాసీనత…!
అయితే ఐజిఎస్‌టి అమలు విషయంలోనూ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదాసీనత ప్రదర్శించారని, దానిని ఇక్కడ అమలు చేస్తే రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందని అధికారులను హెచ్చరించినట్టుగా తెలిసింది. అయితే ఐజిఎస్‌టిని మిగతా రాష్ట్రాలు అమలు చేస్తుండగా మనరాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ సరుకు రవాణా చేసేటప్పుడు ఐజిఎస్‌టికి వ్యాపారులు పన్నులను చెల్లిస్తారు. అందులో మనకు రావాల్సిన వాటాను వెంటనే వచ్చి చేరుతుంది. అలాగే మన దగ్గరి నుంచి వేరే రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నులు సైతం అలాగే చెల్లించాల్సి ఉంటుంది. మనకు వచ్చేది మాత్రమే తీసుకోవాలని, మనం కట్టాల్సింది మాత్రం వేరే రాష్ట్రాలకు ఇవ్వొద్దని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అధికారులతో పేర్కొనడంతో దానిని వారు అమలు చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 2022లో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఐజిఎస్‌టి డేటా అందుబాటులోకి రావడంతో ఆయా వ్యాపారుల నుంచి ఐజిఎస్‌టి పన్నులను తిరిగి రాబట్టుకోవడానికి నోటీసులు ఇవ్వాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.