ఈ నెల 27నే రెండు హామీల అమలు ప్రారంభం రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త
సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలను భర్తీ చేశాం వచ్చే నెల 2వ తేదీన మరో 6వేల కొలువులను భర్తీ చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మేడారం మహా జాతర సందర్బంగా సమ్మక్క-సారలమ్మలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ,గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీనిపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు మంచి శుభవార్త చెప్పబోతున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 6,956 మంది స్టాఫ్ నర్సుల నియామకం, 441 సింగరేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. మార్చి 2వ తేదీన మరో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. రెండు లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పామో…దానికి తగినట్లు 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, వాటిని ప్రజలకు కనిపించేలా.. కుళ్లుకుంటున్న వారికి వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలో నే వేలాది మంది సమక్షంలో వారికి నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుళ్లు,తండ్రీకొడుకలు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు పది స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో
సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం అన్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పాడిపంటలతో ప్రజలు విలసిల్లాలని, నాలుగు కోట్ల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాంత శాసనసభ్యురాలు, మంత్రి సీతక్కతో తనకున్న వ్యక్తిగత అనుబంధం.. రాజకీయంగా తామిద్దరం కలిసి చేసిన ప్రయాణం అందరికీ తెలుసిందేనని అన్నారు. తాము ఏ ముఖ్య కార్యక్రమం తీసుకున్నాఇక్కడ సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు తీసుకొనే మొదలుపెట్టామన్నారు. 2023, ఫిబ్రవరి ఆరో తేదీన హాత్ సే హాత్ జోడోను ఇక్కడ నుంచే ప్రారంభించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రజా తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది.. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వ ఏర్పడుతుందని తాము ఆనాడే చెప్పామన్నారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులకు అసౌకర్యం కలగకుండా, అన్నిరకాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి చేస్తామని ఆనాడే చెప్పామని, అలానే చేశామన్నారు. అమ్మల ఆశీస్సులతో సీతక్క, కొండా సురేఖ మంత్రులయ్యారని, తమందరికీ వివిధ హోదాలు, బాధ్యతలు వచ్చాయనన్నారు. ఆ బాధ్యతతోనే సుమారు ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, ఏర్పాట్లలో లోపం ఉండదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం రూ.110 కోట్లను జాతరకు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికలు పూర్తికాగానే జాతరపై దృష్టి పెట్టాల్సి రావడంతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను బృందంగా ఏర్పాటు చేసి సమన్వయంతో పనులు చేయించినట్లు చెప్పారు. ఆడ బిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే తమ ప్రభుత్వ తొలి నిర్ణయమని, జాతరకు ఆడ బిడ్డలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆరు వేల ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని, అన్ని డిపోల నుంచి బస్సులను ఇక్కడి పంపాలని ఆదేశించడంతో పాటు అదనంగా వంద కొత్త బస్సులు కొనుగోలు చేసి జాతరకు వాటిని వినియోగించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడ బిడ్డలు ఉచిత బస్సులు వినియోగించుకున్నారని, జాతరకు లక్షలాది మంది మహిళలు వచ్చేందుకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడిందని ముఖ్యమంత్రి అన్నారు. సమ్మక్క-సారలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తి అని, ప్రజలపై ఆధిపత్యం చలాయించాలనుకున్న, ప్రజలను పీడించైనా పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులను పేదలు, ఆదివాసీ బిడ్డలైన తల్లీబిడ్డలు, తండ్రీ కొడుకులు అంతా కలిసికట్టుగా పోరాడారని ఆయన కొనియాడారు. బడుగుల, ఆదివాసీల పక్షాన కొట్లాడి నేలకు ఒరిగినందునే వందల సంవత్సరాలైనా సమ్మక్క సారలమ్మను దేవుళ్లుగా కొలుస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. తమను నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు అమరులై వారు దేవతలుగా వెలిశారని ముఖ్యమంత్రి శ్లాఘించారు.