-
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను
-
41 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి
-
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్
-
రాష్ట్రం వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది
-
దేశాభివృద్ధిలోనూ తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
-
ప్రజాభవన్‌లో16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డి
-
సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతంకు పెంచాలని, రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి లేదా అదనపు ఆర్ధిక సాయాన్ని అందించాలని సిఎం రేవంత్ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను కోరారు. ప్రజాభవన్‌లో16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఆయన తెలిపారు. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు. తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తాన్నామని ఆయన చెప్పారు.
భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘాన్ని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్- బడ్జెట్ రుణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని రేవంత్ కోరారు.
ప్రధాని ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తా
అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. ఈ డిమాండ్‌ను మీరు నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని, ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు తగినంత సాయం అందిస్తే దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని సిఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేంద్రం కఠిన నిబంధనతో ఇబ్బందులు : భట్టి
డిప్యూటీ సిఎం భట్టి మాట్లాడుతూ కేంద్ర పథకాల కఠిన నిబంధనల కారణంగా వాటి ప్రయోజనాలు పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్నారు. సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఆయన కోరారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. ఈ క్రమంలోనే మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని భట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని ఆయన అన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవా లంటే తరుచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొం టున్నాయని డిప్యూటీ సిఎం భట్టి పేర్కొన్నారు. కీలక దశలో ఉన్న తెలంగాణ వేగంగా అడుగులు వేస్తుందని డిప్యూటీ సిఎం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6.85 లక్షల కోట్లకు పైగా రుణభారంతో తెలంగాణ సతమతం అవుతోందని వివరించారు.
సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం
సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందని డిప్యూటీ సిఎం భట్టి అన్నారు. సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చారిత్రక కారణాల వల్ల అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. అసమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.