Tuesday, March 11, 2025

3 నెలలు… 1,022 దరఖాస్తులు…

హెచ్‌ఎండిఏకు పెరిగిన దరఖాస్తులు
లేఔట్‌లు, భవన నిర్మాణాల కోసం బిల్డర్ల క్యూ

హెచ్‌ఎండిఏలో నిలిచిపోయిన లే ఔట్‌లకు, బిల్డింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలలుగా హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో అనేక అవినీతి కోణాలు వెలుగుచూడడంతో హెచ్‌ఎండిఏ అధికారులు లే ఔట్‌లు, బిల్డింగ్‌ల అనుమతులను తాత్కాలికంగా ఆపివేశారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏకు ఆదాయం సైతం పడిపోయింది. దీంతో సమస్య కొంతమేర సమస్య సద్ధుమణగడంతో ప్రభుత్వం అనుమతులను ఇవ్వాలని నిర్ణయించింది. హెచ్‌ఎండిఏ పరిధిలో కొత్త వెంచర్లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు నెలల కాలంలోనే అధికంగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఈ అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అనుమతుల మంజూరులోనూ గతంలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ల్యాండ్ కన్వర్షన్‌కు కూడా అనుమతులు ఇవ్వాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రస్తుతం పెరిగిన దరఖాస్తులతో హెచ్‌ఎండిఏకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ వర్గాలు పేర్కొంటున్నాయి.

మూడునెలల్లో 540 దరఖాస్తులకు అనుమతులు
శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్ జోన్‌ల పరిధిలో లేఔట్‌ల అనుమతులు భారీగా వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి నుంచి మార్చి వరకు లే ఔట్ల కోసం, భవన నిర్మాణాలకు సంబంధించి మొత్తం 1,022 దరఖాస్తులు రాగా, ఇందులో 540 దరఖాస్తులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మరో 117 దరఖాస్తులను తిరస్కరించగా, 336 దరఖాస్తులు నిబంధనలను అనుగుణంగా లేక పోవడం, అధికారులు సూచించిన నిబంధనలు పాటించక పోవడం లాంటి కారణాలతో వాటిని పెండింగ్‌లో పెట్టారు.

ఫిబ్రవరిలో 220 దరఖాస్తులు క్లియర్
అయితే జనవరి నెలలో లే ఔట్, భవన నిర్మాణాల కోసం 326 దరఖాస్తులు రాగా అందులో 116 దరఖాస్తులు క్లియర్ కాగా, 41 దరఖాస్తులను వివిధ కారణాలతో హెచ్‌ఎండిఏ అధికారులు తిరస్కరించారు. ఇక 135 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో లే ఔట్, భవన నిర్మాణాల కోసం 394 దరఖాస్తులు రాగా అందులో 220 దరఖాస్తులు క్లియర్ కాగా, 70 దరఖాస్తులను వివిధ కారణాలతో హెచ్‌ఎండిఏ అధికారులు తిరస్కరించారు. ఇక 134 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి నెలలో లే ఔట్, భవన నిర్మాణాల కోసం 302 దరఖాస్తులు రాగా అందులో 204 దరఖాస్తులు క్లియర్ కాగా, 06 దరఖాస్తులను వివిధ కారణాలతో హెచ్‌ఎండిఏ అధికారులు తిరస్కరించారు. మరో 67 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

150కి పైగా ల్యాండ్ కన్వర్షన్ దరఖాస్తులు…
ఇదిలా ఉండగా గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ల్యాండ్ కన్వర్షన్ (భూ మార్పిడులకు) అనుమతులు ఇవ్వడంతో అవినీతికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఈ అనుమతుల ప్రక్రియలో అప్పటి అధికారి శివబాలకృష్ణ కీలంగా వ్యవహారించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల హెచ్‌ఎండిఏ వేల కోట్లు నష్టం వచ్చిందని తేలింది. అయితే ఇక ముందు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా భూ మార్పిడులకు అనుమతులు ఇవ్వాలని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూ మార్పిడి దరఖాస్తులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్‌ప్లాన్‌లకు అనుగుణంగా జోన్ల వారీగా ఈ కన్వర్షన్లు ఉంటాయని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 150పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలిసింది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, ఇబ్బందులు లేకుండా కొత్తగా వచ్చే భూ మార్పిడి దరఖాస్తులను త్వరలోనే అనుమతులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com