- 8 నెలల్లో రూ.30,048 కోట్ల ఆదాయం
- ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.80 వేల కోట్ల పైచిలుకు….
తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయంలోనూ నెంబర్‌వన్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈసారి రూ.80 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఆ శాఖ ఆర్జించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. 2023 నవంబర్ నాటికి (8 నెలల్లోనే) దాదాపు రూ.30,048 కోట్ల జీఎస్టీ వసూళ్లను ఆ సంస్థ సాధించగా, 2024 సంవత్సరం ఫిబ్రవరిలో సుమారుగా రూ.5,211 కోట్లు అత్యధికంగా రావడం విశేషం. 2018-, 19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి ఎనిమిది నెలల్లో తెలంగాణలో రూ.18,964 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.30,048 కోట్ల వసూళ్లను దాటినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఆరేళ్లలో జీఎస్టీ వసూళ్లు 63 శాతం పెరిగింది
ఆరేళ్లలో ఈ వసూళ్లు ఏకంగా రూ.11,084 కోట్లు (63 శాతం) పెరిగాయని అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ అంటే (డెస్టినేషన్ అండ్ యుటిలైజేషన్ ట్యాక్స్‌గా) పిలుస్తారు. అంటే వస్తువు ఎక్కడ తయారవుతుందో పక్కన పెడితే ఏ రాష్ట్రంలో వస్తువు వాడకం జరుగుతుందో ఆ రాష్ట్రానికే జీఎస్టీ వర్తిస్తుంది. రాష్ట్రంలో అంతర్గతంగా వినియోగించే వస్తువులపై వచ్చే జీఎస్టీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి. ఇక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దిగుమతి అయినా సరుకులపై వచ్చే జీఎస్టీని ఐజీఎస్టీ కింద జమ చేస్తారు. ఐజీఎస్టీ కింద జమైన మొత్తంలో సగం కేంద్రానికి పోగా మిగిలిన సగం మొత్తాన్ని ప్రతి నెల సెంట్రల్ క్లియరింగ్ ఏజెన్సీ ఎలక్ట్రానిక్ లెడ్జర్ ద్వారా ఆయా రాష్ట్రాలకు రావల్సిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు.
గత ఏప్రిల్‌లో రూ.4,082 కోట్ల రాబడి
తెలంగాణలో 2019-, 20 ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో రూ.18,218 కోట్లు వసూలు కాగా, 2020-,21లో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గడంతో ఆ ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల జీఎస్టీ రాబడి రూ.15,247 కోట్లకే పరిమితమైంది. ఇక 2021-, 22 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.20,859 కోట్లు, 2022-,23లో నవంబర్ వరకు రూ.27,287 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-,24)లో 8 నెలల్లో రూ.30,047.59 కోట్ల జీఎస్టీ వసూలయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు. 2023 ఏప్రిల్ నుంచి జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు ప్రదర్శించడంతో సుమారుగా రూ.4,082 కోట్ల రాబడి వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వసూలైన జీఎస్టీ కంటే రూ.694 కోట్లు ఎక్కువ. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో నవంబర్ వరకు సగటున నెలకు రూ.3,500 కోట్ల చొప్పున మొత్తం రూ.30,047.59 కోట్ల రాబడి వచ్చింది.
ఫిబ్రవరిలో 18 శాతం అధిక రాబడి
ఇక 2023 ఫిబ్రవరిలో జీఎస్టీ ద్వారా రూ.4,424 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.5211 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఆదాయం గతేడాది కన్నా ఇది రూ.787 కోట్లు అధికమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చిన జీఎస్టీ రాబడులు చూస్తే గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే జాతీయ సగటు వృద్ధి రేటు 14 శాతం కాగా, తెలంగాణ రాబడి 18 శాతం పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023, 24 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో జీఎస్టీతో పాటు మిగతా పన్నులు కలుపుకొని వాణిజ్య పన్నుల శాఖకు మొత్తంగా రూ.80 వేల కోట్ల పైచిలుకు ఆదాయం చేకూరే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.