- ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యం
- అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు
- ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు
- రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు ఉన్నారని అన్నారు. గురువారం ఢిల్లీలో రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
భారతీయుల ప్రతిభ ప్రతిబింబిస్తోంది
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో భారతీయులు సంపన్నులుగా ఉన్నారని, ఇది వారి ప్రతిభను ప్రతిబింబిస్తుందని సీఎం అన్నారు. అమెరికాలో భారతీయుల సగటు ఆదాయం మిగిలిన వర్గాల కంటే రెట్టింపని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన భారతీయుల్లో 33 శాతం మంది తెలుగు కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారని అన్నారు. భారతదేశ వృద్ధికి ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా ఐటీ నుంచి ఏఐ కి మారడం… గ్రీన్ హైడ్రోజన్‌లో అభివృద్ధి సాధించడం… మానవ వనరులని బలోపేతం చేయడంపై తమ లక్ష్యమన్నారు. ఈ రంగాలపై దృష్టి సారించడం వల్ల భారతీయులు ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రామిక శక్తిగా, ఆవిష్కర్తలుగా మారతారని అన్నారు.
భారతదేశానికి జనాభానే బలం :
భారతదేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు ఉన్నందున, భారతదేశానికి జనాభా ప్రయోజనం ఉంది. చైనా, జపాన్ జనాభా తగ్గడం భారతదేశానికి కలిసొచ్చే అంశమని దానిని దేశ అభివృద్ధికి తెలివిగా వినియోగించుకోవాలని చెప్పారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులని చేసే విధానంపై కేంద్రం ఆలోచన చేయాలని సూచించారు.
అమరావతి పునర్నిర్మాణం
గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌ను ఉపయోగించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, దానిని మళ్లీ గాడిలోకి తీసుకువస్తామని చెప్పారు.
చారిత్రాత్మక విజయం :
2024 ఎన్నికల్లో టీడీపీకి 93 శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేరును సాధించిందని ముఖ్యమంత్రి అన్నారు. తన నాయకత్వానికి ప్రజలు బలమైన మద్దతును ఇచ్చారని అన్నారు. తాను ఎలాంటి నేరం చేయకుండా అరెస్టు చేస్తే, ప్రజలంతా ఆ సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. గవర్నెన్స్ అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా తెలివిగా ఉండాలని, 1,000 సేవలను మీ సేవ – వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని అన్నారు.
భారతదేశం ముందున్న మార్గం
భారతదేశ అభివృద్ధిని ఆపలేమని చంద్రబాబు అన్నారు. రానున్న 10-15 ఏళ్లలో భారతీయ నిపుణులు సేవా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు. నేటి ప్రపంచంలో దూరం అనేది ఒక పరిమితి కాదని అన్నారు.