2040 నాటికి చంద్రుడిపై భారతీయుడి లాండింగ్
ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్..!
అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ భారత్ చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోబోతున్నామన్నారు. అలాగే, 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపు తారన్నారు. ఫిబ్రవరి 27న తిరువనంతపురంలో గగన్‌యాన్ మిషన్‌ను సంబంధించిన వ్యోమగాముల పేర్లను ప్రకటించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ కల త్వరలోనే నెరవేరబోతున్నది. ప్రస్తుతం దేశాలకు స్పేస్‌స్టేషన్స్ ఉన్నాయి. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే.. చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్‌స్టేషన్ ఉన్న మూడో దేశంగా నిలువనున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ భారత్ స్పేస్ స్టేషన్ కోసం ప్రణాళికలు రూపొందించింది. 52 టన్నుల బీఏఎస్ తొలుత ముగ్గురు వ్యోమగాములు వెళ్లొచ్చు.
భవిష్యత్‌లో దాని సామర్థ్యాన్ని ఆరుకి పెంచే యోచనలో ఉంది. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. బీఏఎస్ అనేది లైఫ్ సైన్సెస్, మెడిసిన్ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలను మెరుగుపరిచేందుకు భారత్ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్ స్పేస్ స్టేషన్. తొలి మాడ్యుల్ 2028లో ఎల్‌వీఎం3 వాహక నౌక ద్వారా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత స్పేస్‌స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. స్పేస్‌స్టేషన్ మూడ్యుల్స్‌ని పలు దశల్లో నింగిలోకి పంపి.. ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. 2035 నాటికి స్పేస్‌స్టేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్‌స్టేషన్ ఉన్నది. దీన్ని నాసా అనేక దేశాల సహకారంతో నిర్మించింది.
ప్రస్తుతం చైనా సైతం సొంతంగా ఇంటర్‌నేషనల్ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది. భారత్ సైతం బీఎస్‌ఏని నిర్మిస్తే మూడో దేశంగా నిలువనున్నది. ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్ సస్టెయినింగ్ టెక్నాలజీస్‌పై అధ్యయనానికి అనుమతి ఇస్తుంది. అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో భారత్ పేరు సైతం చేరనుంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం యువ శాస్త్రవేత్తలను ప్రేరేపించడంతో పాటు అంతరిక్షరంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం. చంద్రయాన్-1తో చంద్రుడిపై తొలిసారిగా నీటిజాడలను గుర్తించింది. ఆ తర్వాత చంద్రయాన్-3తో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇస్రో నిలిచింది. భారత్ స్పేస్ స్టేషన్ సైతం గర్వకారణంగా నిలువనున్నది. అదే సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ స్థానాన్ని సుస్థిరం చేయనుంది.