- మరింత పవర్ ఫుల్‌గా నౌకాదళం
- అమ్ములపొదిలో అత్యాధునిక అస్త్రాలు
- యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ
భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై.. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకదళ బలం మరింత పటిష్టం కానుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలని ముందుకుసాగుతున్న భారత్ లక్ష్యసాధనకు ఇది పెద్ద ముందడుగుగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివి. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు. నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడింది.
తొలిసారిగా.. రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఒకేసారి మనం ప్రారంభించుకున్నాం. ఇవన్నీ భారత్‌లో తయారైనవే. వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత అందుతుంది‘ అని వివరించారు. ‘సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, ఏడు జలాంతర్గాములు నేవీలో చేరాయి. రక్షణరంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్రతీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలి‘ అని ప్రధాని పిలుపునిచ్చారు.ఐఎన్‌ఎస్ సూరత్.. పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్టాయ్రర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం.ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.