భారత దేశం యొక్క సాధారణ బడ్జెట్ 2025, ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది మోడీ ప్రభుత్వ పూర్తి బడ్జెట్ (మోడీ 3.0). ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు చేస్తుందోనని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బడ్జెట్‌కు సంబంధించి కొన్ని చారిత్రక విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు ‘బడ్జెట్’ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి బడ్జెట్ ఎప్పుడు సమర్పించారు ? ఎవరు సమర్పించారు ? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
బడ్జెట్ అనే పదం ఎలా పుట్టింది?
‘బడ్జెట్’ అనే పదానికి మూలం ఫ్రెంచ్ పదమైన ‘బుల్గా’. బుల్గా అంటే తోలు సంచి అని అర్థం. ‘బౌగెట్’ అనే పదం ఫ్రెంచ్‌లోని ‘బుల్గా’ నుండి ఏర్పడింది. దీనిని ఆంగ్లంలో ‘బోగెట్’ అని పిలుస్తారు. క్రమంగా ఇది ‘బడ్జెట్’గా మారింది. ఈ కారణంగానే ఇంతకుముందు బడ్జెట్ పత్రాలను లెదర్ బ్యాగుల్లో పార్లమెంటుకు తీసుకొచ్చారు. బ్రిటీష్ హయాంలో మొదలైన ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగింది. కానీ ఇప్పుడు డిజిటల్ మయం అయింది.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఎలా మారింది ?
బ్రిటీష్ పాలన కాలం నుంచి 2019 వరకు బడ్జెట్ పత్రాలను ఎర్రటి లెదర్ బ్యాగుల్లో తీసుకొచ్చేవారు. ఇది ప్రతి ఆర్థిక మంత్రి అనుసరించే సంప్రదాయం. అయితే 2019లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంప్రదాయాన్ని మార్చారు. బడ్జెట్ పత్రాలను ఎర్రటి గుడ్డలో చుట్టి ‘బహీ-ఖాతా’ రూపంలో పార్లమెంటులో సమర్పించేవారు. దీని తరువాత, 2021 నుండి బడ్జెట్ పూర్తిగా డిజిటల్‌గా మారింది. ఇప్పుడు బడ్జెట్ టాబ్లెట్‌లో చూసి చదువుతున్నారు. భారతదేశ ఆర్థిక పరిపాలనను ఆధునీకరించే దిశగా ఈ మార్పు ఒక ముఖ్యమైన అడుగు అనే చెప్పవచ్చు.
ఇంతకుముందు బడ్జెట్‌ను సాయంత్రం సమర్పించేవారు ?
ఫ్రిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించారు. కానీ భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించారు. దీనికి కారణం బ్రిటన్ , భారతదేశం మధ్య సమయ వ్యత్యాసం. తద్వారా బ్రిటిష్ అధికారులు దానిని అర్థం చేసుకోవడానికి పూర్తి సమయం ఉంటుంది. 1955 వరకు, బడ్జెట్ ఆంగ్లంలో మాత్రమే ప్రచురించబడింది. కానీ 1955-56 నుండి హిందీలో కూడా ప్రచురించడం ప్రారంభమైంది. ఇది ఒక ముఖ్యమైన మార్పు. దీని కారణంగా సామాన్య ప్రజలు బడ్జెట్ గురించి సులభంగా సమాచారాన్ని పొందడం ప్రారంభించారు.
భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ఎప్పుడు సమర్పించారు ?
భారతదేశంలో బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం బ్రిటిష్ పాలనలో ప్రారంభమైంది. భారతదేశంలో మొదటిసారిగా 7 ఏప్రిల్ 1860న బడ్జెట్‌ను సమర్పించారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వ అధికారి జేమ్స్ విల్సన్ సిద్ధం చేశారు. విల్సన్ భారతదేశంలో పన్ను వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన స్కాటిష్ ఆర్థికవేత్త. దీని తరువాత, భారతదేశంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ సమర్పించడం జరిగింది. ఇది దేశ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా మారింది.
స్వతంత్ర భారత తొలి బడ్జెట్ ఎలా ఉంది ?
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి సాధారణ బడ్జెట్ 26 నవంబర్ 1947 న సమర్పించబడింది. దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ భారతదేశానికి చారిత్రాత్మకమైనది. ఎందుకంటే మొదటిసారిగా దేశ ఆర్థిక విధానాలకు పునాది వేయబడింది. చెట్టి ప్రఖ్యాత న్యాయవాది, రాజకీయవేత్త , ఆర్థికవేత్త. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. కానీ ఈ బడ్జెట్ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మొదటి అడుగు వేసింది.