Saturday, December 28, 2024

ఇండస్ట్రీ వర్సెస్‌ గవర్నమెంట్‌… అసలు విషయం ఇది?

– జగన్‌తో అలా, రేవంత్‌తో ఇలా
– గీతా ఆర్ట్స్ ట్వీట్ వైరల్
– ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా హైదరాబాద్‌

ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ వర్గాల మాట రాజకీయనాయకుల మాట ఒకే థాటి మీద ఉండేవారు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా సినీ ప్రముఖులు ప్రభుత్వాలతో సఖ్యతగానే ఉన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తినా మీటింగ్ పెట్టి సామరస్యంగా రెండు ప్రభుత్వాలు ఎంతో పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు చోట్లా అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో, తెలంగాణలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక్కసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి అనుకున్నంత అనుకూలంగా ఉండడంలేదు. అయితే ఇందులో ముఖ్యమంత్రిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ఆయన పని ఆయన చేసుకెళుతున్నారు. కాకపోతే దానివల్ల వీళ్ళకు కొన్ని నష్టాలు జరగడం వల్ల ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఇదొక పెద్ద సమస్యలా మారింది. అల్లు అర్జున్ కేసు.. తదనంతర పరిణామాలతో తెలంగాణా ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోందనే మాట ఎక్కువగా వినిపించింది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్లు ఉండవని ప్రకటించిన తరుణంలో.. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా సరే, దాదాపు యాభై మంది సినీ జనాలు భేటీకి వెళ్ళారు. ప్రభుత్వం తరపున సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, రాష్ట్ర డీజీపీ మీటింగ్ లో పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, వెంకటేష్, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, శివ బాలాజీ.. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, సురేష్ బాబు, మురళీ మోహన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సహా పలువురు దర్శక నిర్మాతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలానే సినీ ప్రముఖులు వెళ్లి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించి వచ్చారు. వారిలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు. మెగాస్టార్ ఆ మీటింగ్ లో జగన్ కు నమస్కరించడంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. చిరుతో దండాలు పెట్టించుకున్నాడని ఫ్యాన్స్ తిట్టిపోశారు. అంతేకాదు అందరినీ గేటు దగ్గర నుంచీ నడిపించారని విమర్శలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వెళ్ళలేదు. ఈసారి నాగార్జున, వెంకటేష్ వంటి బిగ్ హీరోలు ముందుండి నడిపించారు. సీనియర్ దర్శక నిర్మాతలు కూడా వారితో పాటుగా ఉన్నారు. అందరూ సీఎంకు నమస్కరించారు. శాలువాలు కప్పారు. దీంతో గతంలో జగన్ తో భేటీ అయిన విషయాన్ని తాజాగా రేవంత్ మీటింగ్ తో లింక్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆరోజు జగన్ కు నమస్కరించినప్పుడు ఆత్మాభిమానం దెబ్బ తింటే, ఇప్పుడు పెద్ద వయసున్న వారు కూడా రేవంత్ కు నమస్కరించినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రెండిటినీ కంపేర్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణాలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ నుంచి కూడా పోస్ట్ వచ్చింది.

”తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకెళ్లడంలో దార్శనిక నాయకత్వం మరియు స్థిరమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక పరిశ్రమగా, ప్రభుత్వం యొక్క ప్రగతిశీల కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి, రాష్ట్రం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మేమంతా ఐక్యంగా అంకితభావంతో కృషి చేస్తాం. సమాజ అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ యొక్క నిరంతర వృద్ధికి గణనీయమైన సహకారం అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని గీతా ఆర్ట్స్‌ సంస్థ ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ”హైదరాబాద్‌ వరల్డ్ కేపిటల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవబోతోంది” అని అన్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తామని, హైదరాబాద్ ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్ గా చేయడానికి అడుగులు వేస్తామని చెప్పారు. కానీ ఈ మీటింగ్ లో అల్లు అర్జున్ వివాదం గురించి చర్చలు జరగలేదని పలువురు సినీ ప్రముఖులు చెప్పారు. అయితే రానా, బన్నీ అందరూ నాకు బాగా సన్నిహితులే.. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ వీలైనంత త్వరగా ఈ కేసు నుంచి బయటపడి ఈ వివాదానికి శుభం కార్డ్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సీఎంతో మీటింగ్ తర్వాత ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెలుగు సినిమాని ఇండియా లెవల్ లోనే కాకుండా, ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేలా డెవలప్ చేయడానికి సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి పని చేయబోతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాల షూటింగ్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగడానికి ఇండస్ట్రీ నుంచి సలహాలు ఇవ్వమని సీఎం కోరారు. హైదరాబాద్ ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్ గా చేయడానికి అడుగులు వేస్తాం అని దిల్ రాజు తెలిపారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం దర్శక హీరోలతో అవగాహన కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఓవరాల్ గా ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయడం గురించే ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చినట్లుగా దిల్ రాజు తెలిపారు. వన్ ఆఫ్ థి బెస్ట్ మీటింగ్ జరిగిందని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com