తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) గడువును మే 3 వరకు పొడిగిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం రాయితీతో అమల్లో ఉన్న ఈ పథకానికి ఇదివరకే రెండుసార్లు గడువు పెంచారు. 2020లో ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన 25.67 లక్షల దరఖాస్తుల్లో ఇంకా పరిష్కారం కాని వాటి కోసం ఓటీఎస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఫిబ్రవరిలో ఓటీఎస్ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం, తాజాగా మే 3 వరకు అవకాశం కల్పించింది.
తెలంగాణ ఎల్‌ఆర్‌ఎస్ కోసం దాఖలైన 25.67 లక్షల దరఖాస్తుల్లో, నిషేధిత భూములు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల సమస్యల కారణంగా సుమారు 5.67 లక్షల దరఖాస్తులకు ఫీజు చెల్లింపు సమాచారం (ఇంటిమేషన్) ఇవ్వలేదు. వీటిని తిరస్కరించినట్లేనని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన 20,00,495 దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ లేఖలు పంపగా.. ఇప్పటివరకు కేవలం 5.14 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లింపుల సరళిని పరిశీలిస్తే, మార్చి నెలలో అత్యధికంగా 3.50 లక్షల మంది చెల్లించగా, ఫిబ్రవరిలో కేవలం 14,104 మంది, ఏప్రిల్‌లో 1,49,896 మంది చెల్లించారు. మార్చి 31 నాటికి మొత్తం 3,64,104 మంది ఫీజు చెల్లించారు. పురపాలక శాఖ పరిధిలోని 156 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి 15,37,159 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా.. వాటిలో 11,48,532 దరఖాస్తులకు మాత్రమే ఫీజు ఇంటిమేషన్ లేఖలు జారీ చేశారు. మిగిలిన దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరిధిలో 3,24,296 దరఖాస్తుదారుల నుంచి ఫీజు వసూలు కాగా, 87,153 దరఖాస్తులకు సంబంధించి క్రమబద్ధీకరణ ప్రక్రియలు (ప్రొసీడింగ్స్) జారీ చేశారు. ఇప్పటివరకు ఈ విభాగం ద్వారా రూ.1,169 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 3.44 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు దాఖలు కాగా.. కేవలం 64 వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. సాంకేతిక సమస్యల కారణంగా హెచ్‌ఎండీఏ ప్రొసీడింగ్స్ జారీ చేయడంలో వెనుకబడి ఉంది. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏకు రూ.189 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.1,720 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సీడీఎంఏ పరిధిలో రూ.1,169 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.189 కోట్లు, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ పరిధిలో రూ.362 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, తాజాగా ప్రభుత్వం గడువు పొడిగించడంతో మరో రూ.500 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.