Thursday, November 28, 2024

హైదరాబాద్‌లో ఐడిటిఆర్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం వినతి
హైదరాబాద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడిటిఆర్) ఏర్పాటుకు అనుమతించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల ప్రభుత్వం గుర్తించిన 40 ఎకరాల భూమిలో ఢిల్లీలోని ఐడిటిఆర్ తరహాలో 15వ ఫైనాన్స్ కమిషన్ కింద హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడిటిఆర్) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. బహుళ-లేన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌ను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని, రోడ్ సేఫ్టీ కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమలు కోసం, ఈ- చలాన్‌ల ఆటో జనరేషన్ ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను గుర్తించాలన్నారు.

వాహన్ అండ్ సారథి సాఫ్ట్‌వేర్‌లకు బదిలీ చేయడం, – డిపార్ట్‌మెంట్ వాహనం డేటాను ఎన్‌ఐసి నిర్వహించే నేషనల్ రిజిస్టర్‌కి పోర్ట్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎర్‌ఐసి ద్వారా వాహన్, సారథి అమలుకు అనుమతించిందని కేంద్రమంత్రికి వివరించారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఉంచాలని ఎన్‌ఐసిని ఆదేశించవచ్చని తద్వారా పోర్టింగ్ వేగంగా డేటాను కోల్పోకుండా చేయవచ్చని అన్నారు. ఎంవిఐలు, ఎఎమ్‌విఐలకు నాణ్యమైన సాంకేతికంగా ఫీల్ శిక్షణ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని, ఈవి ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు భారీ డిమాండ్ ఉందని, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లను ఆటోమేట్ చేయడానికి మద్దతు ఇవ్వాలని, పారదర్శకంగా, సాంకేతికతతో నడిచే వేగవంతమైన పరీక్ష కోసం 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్ కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టలకు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రెండు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రాలు ఇప్పటికే ఆమోదించబడ్డాయని, 37 ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి పరిపాలనా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేయబడే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం రోడ్డు పన్ను , రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర మంత్రి గడ్కరికి వివరించారు. తన నియోజకవర్గం హుస్నాబాద్ లో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు గా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

తన నియోజకవర్గం హుస్నాబాద్ లో పలు రోడ్లను డబుల్ రోడ్ల కు విస్తరణ, హైలెవల్ బ్రిడ్జి ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. కోహెడ – దేవరక్కపల్లి రోడ్డు విస్తరణ, పిడబ్లుడి రోడ్ నుండి నాగ సముద్రాల రోడ్డు విస్తరణ, పిడబ్లుడి అక్కన్నపేట్ వయా రామవరం నుండి జనగామ వరకు రోడ్డు విస్తరణ, గుగ్గిళ్ళ నుండి తంగలపల్లి వరకు రోడ్డు విస్తరణ, తంగపల్లి వయా గుండారెడ్డి పల్లి నుండి బద్దిపడగా వరకు రోడ్డు విస్తరణ, గుంటూరు పల్లి నుండి కేశవపురం ,కోతుల నడుమ మల్కనూరు వయా గోపాలాపూర్ వరకు రోడ్డు విస్తరణ, కోతుల నడుమ నుండి జగన్నాధపురం వయా జిలుగుల పెంచికర్ల రోడ్డు విస్తరణ, పిడబ్లుడి రోడ్డు వంగర హుజూరాబాద్ నుండి కన్నారం వరకు రోడ్డు విస్తరణ, బొమ్మనపల్లి డబుల్ లైన్ పొలంపల్లి వరకు, హుజూరాబాద్ నుండి సుందరగిరి రోడ్డు విస్తరణ, హుజురాబాద్ సుందరగిరి మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, మూలంగుర్ సైదాపూర్ మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, కొత్తగట్టు దుద్దెనపల్లి మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, మానకొండూరు హుస్నాబాద్ మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం తదితరాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular