- ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీపైనే ఆసక్తి
- తమ ర్యాంకు కన్వీనర్ కోటా సీటు రాదనుకుంటే
- మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు ప్రయత్నాలు
- మన రాష్ట్రంలో సీటు లభించకపోతే…
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అన్ని ర్యాంకుల విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకున్నారు. అయితే విద్యార్థులకు వచ్చిన ఎప్‌సెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్‌లో తమకు ఏ బ్రాంచీలో…ఏ కాలేజీలో సీటు లభిస్తుందో ఇప్పటికే ఒక అంచనా వచ్చారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో సిఎస్‌ఇ బ్రాంచీకి ఎక్కువ డిమాండ్ ఉంది. కన్వీనర్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీటు రాదని అంచనాకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మేనేజ్‌మెంట్‌లోనైనా సిఎస్‌ఇ సీటు పొందేందుకు తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందడం, లేదంటే ఎంఎస్ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచీపైనే ఆసక్తి చూపుతున్నారు. డిజిటలైజేషన్‌లో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్ నియామకాలు భారీగా పెరగడం.. ఇతర విభాగాల్లో ఆశించిన స్థాయిలో నియామకాలు లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సిఎస్‌ఇ సీట్ల కోసం పోటీ పడుతున్నారు.
ఈ బ్రాంచీలో రాష్ట్రంలో సీటు లభించకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇప్పటివరకు ప్రకటన విడుదల కాలేదు. అయినా సిఎస్‌ఇ సీట్ల కోసం అనధికారికంగా ఒప్పందాలు జరిగిపోయినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి డిమాండ్ రావడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఒక్కసారిగా డొనేషన్లు, ఫీజులను పెంచేశాయి. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కోరుకున్న కళాశాలలో కోరుకున్న కోర్సులో సీటు లభిస్తుంది. ర్యాంకు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు కోరుకున్న కళాశాలగానీ లేదా కోరుకున్న బ్రాంచీగానీ ఏదో ఒకటే లభిస్తుంది. కన్వీనర్ కోటా కింద సీటు రాదని భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటాలో అధిక ఫీజు చెల్లించి అయినా సిఎస్‌ఇలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
రెండు కోటాలకు డిమాండ్
ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు కళాశాల కంటే కూడా బ్రాంచీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీటుకు కన్వీనర్, మేనేజ్‌మెంట్ రెండు కోటాలలో అధిక డిమాండ్ ఉంది. యాజమాన్య కోటాతోపాటు కన్వీనర్ కోటాలోనూ ఈ బ్రాంచీకే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తాము కోరుకున్న కళాశాలలో తాము కోరుకున్న బ్రాంచీలో సీటు పొందడానికే విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, కళాశాలల విషయంలో కొంత రాజీపడుతున్నట్లు తెలుస్తోంది. తమ ర్యాంకును బట్టి కన్వీనర్ కోటాలో తాము కోరుకున్న బ్రాంచీలో సీటు రాదని భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటాలో అయినా కంప్యూటర్ సైన్స్‌లోనే సీటు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సిఎస్‌ఇలో పెరగనున్న సీట్లు
ఇంజనీరింగ్ సీట్లు మార్చుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ కాలేజీలు చాలా వరకు ఇతర బ్రాంచీల సీట్లకు సిఎస్‌ఇకి మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. దాంతో ఈసారి ఇప్పటికే ప్రకటించిన కంప్యూటర్ సైన్స్ సీట్లతో పాటు సుమారు మరో 2 వేల సీట్ల వరకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అందులో అత్యధికంగా సిఎస్‌ఈలోనే 21,599 సీట్లు ఉన్నాయి. అలాగే సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 11,196 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 1365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 606 సీట్లు, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ)లో 126 సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ)లో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
ఈ సీట్లకు అదనంగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందబాటులోకి రానున్నాయి. సిఎస్‌ఇకి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి, అందుకు అనుగుణంగా ప్రైవేట్ యాజమాన్యాలు సీట్లు పెంచుకుని అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నారు. టాప్ ఇంజినీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కంప్యూటర్ సైన్స్ సీటు రూ.13 నుంచి రూ. -15 లక్షల మధ్య పలుకుతున్నట్లు సమాచారం. మధ్యస్థంగా ఉండే కళాశాలల్లో రూ.8 నుంచి రూ.-10 లక్షల మధ్య వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కంప్యూటర్ సైన్స్ అనుబంధ విభాగాల్లో కళాశాలను బట్టి సీట్లు రూ.6- నుంచి రూ. 10 లక్షలు పలుకుతున్నాయి. ఇంజనీరింగ్ నాలుగేళ్లకు ముందే ఒక ప్యాకేజీగా మాట్లాడుకుని యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.