అమ్మాయిలతో సరదాగా మాట్లాడతారా! ఆమె నగ్నవీడియోలను ఆస్వాదించాలనుకుంటున్నారా! మీరిద్దరూ ఏకాంతంగా గడపాలని ఆశపడుతున్నారా! ప్రతి దానికీ ఒక రేటు. నిషేధిత వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా అందాలను ఎరవేసి కొందరు అక్రమార్కులు అందినంత దండుకుంటున్నారు. ఇలాంటి హైటెక్ వ్యభిచార గుట్టును హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. విదేశీ యువతులను రప్పించి చీకటి కార్యకలాపాలు సాగిస్తున్న వారి గుట్టురట్టు చేశారు.
ఒంటరితనం నుంచి బయటపడేందుకు, సరదాగా మాట్లాడేందుకు సరైన భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చంటూ అంతర్జాలంలో ప్రకటనలిస్తారు. ఆకర్షితులైన వారిని వెబ్‌సైట్లు, యాప్‌ల్లో మెంబర్షిప్ తీసుకోవాలని షరతు విధిస్తారు. సభ్యులుగా చేరేందుకు ఒక్కొకరి వద్ద రూ.5-10 వేల వరకూ వసూలు చేస్తారు. సభ్యత్వం తీసుకున్నాక వెబ్‌సైట్లు, యాప్‌ల్లోని యువతులు, మహిళలతో ఛాటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి విపరీతమైన డిమాండ్ పెరగటంతో భాగ్యనగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించే కొందరు దళారులు ఈ తరహా యాప్‌ల ద్వారా విటులను ఆకట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్, నైజీరియా దేశాల నుంచి యువతులను జాబ్స్, పర్యాటక వీసాలతో నగరానికి చేరవేస్తున్నారు. మసాజ్ సెంటర్లు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని అక్కడ వీరితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు నగరానికి చెందిన పోలీసు అధికారి తెలిపారు.
పర్యాటక వీసాలతో నగరానికి అక్రమ రవాణా
గచ్చిబౌలిలో ఇటీవల పట్టుబడిన 17 మంది యువతుల్లో కొందరి పాస్‌పోర్టు గడువు ముగిసినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వీరిని ఒకే ప్రాంతంలో ఉంచితే పట్టుబడే అవకాశం ఉండటంతో తరచూ వేర్వేరు నగరాలకు తిప్పుతూ పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. కాగా యాప్‌ల వేదికగా అక్కడి సభ్యులకు విదేశీ యువతులను పరిచయం చేస్తున్నారు.
అమ్మాయిలు నగ్నంగా మారి వీడియోకాల్‌లో మాట్లేడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారితో గడిపేందుకు ఆసక్తి చూపిన విటులకు ఆ ప్రాంతాల్లోని ఏజెంట్ల ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. పోలీసులు గుర్తించకుండా కేవలం యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే మంతనాలు సాగించటం ముఠాల ప్రత్యేకత. విటుల నుంచి భారీగా సొమ్ము కాజేసే నిర్వాహకులు, ఒక్కో యువతికి రోజుకు రూ.500-1000లోపు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం.
స్పా తో ఠాణాలకు ప్రత్యేకాదాయం
నగరంలోని పలు స్పా సెంటర్లలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వీధివీధిన మసాజ్ సెంటర్లు ఉన్నాయి. గతంలో ఇక్కడ పోలీసులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. నెలవారీ మామూళ్లు అందని సమయంలో మాత్రమే ప్రత్యేక విభాగాల పోలీసులు దాడులు నిర్వహిస్తారనే విమర్శలున్నాయి.
సిటీలోని ఒక ఠాణా పరిధిలో స్పా కేంద్రాల నుంచి ప్రత్యేక విభాగానికి నెలకు రూ.5లక్షలు చేరతాయని తెలుస్తోంది. తాజాగా మధురానగర్ ఠాణాలోని నలుగురు పోలీసులు వ్యభిచారం నిర్వహించే మర్దన కేంద్రంతో సంబంధాలున్నట్టు వెలుగు చూసింది. వారాంతపు సమయాల్లో నలుగురు కానిస్టేబుళ్లు ఇక్కడే మర్దనతో సేదతీరుతుంటారని దర్యాప్తులో బయటపడింది. అయితే కొందరు సిబ్బంది స్పా కేంద్రాల నిర్వాహకులకు సహకారం అందిస్తున్నట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా లోతుగా ఆరా తీస్తున్నారు.