Saturday, April 19, 2025

గ్రీన్ ఎనర్జీ పాలసీతో అంచనాలకు మించి పెట్టబడులు

ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వొస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్, రాజేందర్ నగర్ లోని  తెలంగాణ  ఇన్స్టిట్యూట్ రూరల్  డెవలప్మెంట్  సంస్థలో  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి టీజీ రెడ్కోతో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జిపిఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు.‌

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.
న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దావోస్ వెళ్లినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా మెగా కంపెనీ 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.7500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందన్నారు. ఈ రెండు కంపెనీలు డిపిఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ రెండు కంపెనీలకు చెందిన కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో మొదలవుతాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ వల్ల  రాష్ట్రంలో 27 వేల కోట్ల పెట్టుబడులతో 5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలు అధిగమించడానికి త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.

2023 సంవత్సరంలో 15,623 మెగావాట్ల గరిష్ట పిక్ డిమాండ్ రాగా,  ఈ సంవత్సరం మార్చి 20న 17,162 మెగావాట్ల గరిష్ఠ పీక్ డిమాండ్ చేరుకున్నప్పటికీ పకడ్బందీ వ్యూహంతో ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేశామని చెప్పారు. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకి అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్, మూసి పునర్జీవం, ఫ్యూచర్ సిటీ ఇలా అనేక రకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా 2029-30 నాటికి 24,215 మెగావాట్ల గరిష్ట డిమాండ్, 2034- 35 నాటికి 31 809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసుకొని దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి,  క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రణాళికలు తయారు చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తున్నదని వివరించారు. 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి మరో 20వేల మెగావాట్లు మొత్తం 40 వేల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ తో ముందుకుపోతున్నదని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎనర్జీ పాలసీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండటంతో చాలామంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నారని వెల్లడించారు. టీజీ రెడ్కో తో ఎంఓయూ చేసుకున్న ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని, క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని నిర్దిష్ట గడువులోగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. 15 జిల్లాల్లో కంప్రెస్డ్  బయో-గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీజీ రెడ్కోతో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్న జిపిఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు రావడం పట్ల అభినందించారు. రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు అవుతున్న నేపథ్యంలో వరి గడ్డితో తయారు చేసే కంప్రెస్డ్ బయోగ్యాస్ వల్ల రైతులకు ఆర్థికంగా ఉపయోగం జరుగాలన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com