ఆదాయన్వేషణలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంటున్నది. ఇప్పటికే బీరు ధరలు 15 శాతం పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్‌ఎమ్‌ఎల్) మద్యం రకాల ధరల పెంపునకు నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధరల నిర్ణయ కమిటీ మద్యం ధరలను 15 శాతం నుంచి 20 శాతం మేరకు పెంచవచ్చని సూచిస్తూ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో 180 ఎంఎల్ ఉండే క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.110 ఉండగా.. మరో రూ.20 వరకు పెరిగే అవకాశముంది. మద్యం ధరల పెంపుపై కసరత్తు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చని నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి, డిస్టలరీలకు ఇచ్చింది. దీంతో త్వరలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
పొరుగు రాష్ర్టాల్లో చీప్ లిక్కర్ మీద ధరల నియంత్రణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు చీప్ లిక్కర్ మీద ఎక్సైజ్‌డ్యూటీ, వ్యాట్ పన్నులు తగ్గించుకొని తక్కువ ధరలకే అమ్ముతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం 90 ఎంఎల్ టెట్రాప్యాక్ చీప్ లిక్కర్‌ను రూ.45కు అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీదారు పేరుతో క్వార్టర్ సీసాను రూ.35కే అందుబాటులోకి తెచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు క్వార్టర్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తున్నది. పొరుగు రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణలో కూడా చీప్ లిక్కర్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించి ధరలు తగ్గించాలని డిమాండ్ ఉన్న.. ధరల నియంత్రణ కమిటీ సూచనలతో పెంచేందుకే సిద్ధమవుతున్నది. దీనిలో భాగంగా చీప్‌లిక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచటానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.