అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా..? అని బాధపడిన రోజులు ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో తన తండ్రి కేసీఆర్ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి బెదిరిస్తే కన్నీరు పెట్టుకున్నానని.. ఆ తర్వాత తన కుమారుడి బాడీ షేమింగ్, తనపై తప్పుడు కామెంట్స్ చేస్తే బాధపడిన రోజులు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో అగ్రెసివ్‌గా ఉంటారని, దూకుడు స్వభావానికి, వాక్చాతుర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారని తెలిసిందే. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో ఆయన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న అవగాహన, సమయస్ఫూర్తితో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటారు. అటువంటి కేటీఆర్ చాలా సందర్భాల్లో కన్నీరు పెట్టుకున్నారు. ఓ ఐపీఎస్ అధికారి బెదిరిస్తే ఏడ్చారు. ఈ విషయాలను కేటీఆరే స్వయంగా వెల్లడించారు.
చాలాసార్లు ఏడ్చా
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను చాలా సందర్భాల్లో కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని.. ఆ సమయంలో చాలా బాధపడినట్లు చెప్పారు. ‘ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో చాలా బాధపడ్డాం. ఆ సమయంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చాడు. ఉమ్మడి ఏపీలో ఆయన ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నారు. కేసీఆర్ గారు నిమ్స్‌లో ఉంటే ఆ అధికారి మమ్మల్ని పక్కకు తీసుకెళ్లారు. కేసీఆర్ రేపు చచ్చిపోతారు.. ఈ రోజు రాత్రి బ్రెయిన్ డెడ్ అయిపోతారు.. ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవట్లేదు. మీరు అనవసరంగా మీ నాన్నగారిని కోల్పోతారు. ప్రజలు రెండ్రోజులు బాధపడి మర్చిపోతరు. మీరు మాత్రమే జీవితకాలం బాధపడ్తరు. ఇది ఇక్కడతో ఆపేయండని బెదిరించిండు. ఆ సమయంలో చాలా ఏడ్చా.
నా కొడుకును బాడీ షేమింగ్ చేసినప్పుడు.. ఇష్టమెుచ్చినప్పుడు తిట్టినప్పుడు.. ఇంట్లో వాళ్లతో కలిసి బాధపడ్డాం. లేని దిక్కుమాలిన సంబంధాలు అంటగట్టి నోటికొచ్చినట్లు మంత్రులతో సహా మాట్లాడుతుంటే.. చాలా బాధపడ్డాం. ఎందుకొచ్చామా.. ఈ దరిద్రంలోకి.. రాజకీయాలను వదిలిపెడితే బాగుండేది అనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ చివరకు ఆలోచిస్తే.. ఇంత గొప్ప ఫేం, ఇంత గొప్ప అవకాశం ఎవరికీ రాదనిపించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దయతో గొప్ప గుర్తింపు వచ్చింది. 5 సార్లు సిరిసిల్ల నుంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. భారీ మెజార్టీలతో గెలిపించారు. మెుదటి సారి 171 ఓట్ల మెజార్టీతో గెలిచివాడ్ని చివరిసారి ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ 30 వేల మెజార్టీతో గెలిపించారు. ప్రజల రుణం తీర్చుకోలేనిది.’ అని కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు.