ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తూర్పు అజర్‌బైజన్ లో ఒక ఆనకట్టను ఆరంభించి తిరిగి వస్తుండగా.. అతను ప్రయాణిస్తున్నహెలికాప్టర్ కూలిపోయింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాకాన్, జోల్ఫా నగరాల మధ్య ఉన్న డిజ్‌మార్ అడవుల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. తూర్పు అజర్‌బైజాన్, టెహ్రాన్, అల్బోర్జ్, అర్దబిల్, జంజాన్ మరియు వెస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్సుల నుండి 46 వేగవంతమైన రెస్క్యూ బృందాలను ఆపరేషన్‌లో సహాయం చేయడానికి పంపినట్లు ఐఆర్‌సీఎస్ ఆదివారం రాత్రి తెలియజేసింది. అంతకుముందు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న ఐఆర్‌సీఎస్ చీఫ్ పిర్హోస్సేన్ కౌలివాండ్ మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణం కారణంగా ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందన్నారు. ఐఆర్‌సీఎస్ ఆపరేషన్స్ హెడ్ రజీహ్ అలిష్వాండి మాట్లాడుతూ, నాలుగు ప్రత్యేక బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరువగా ఉన్నాయని, అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రమాదం జరిగిన స్థలం వద్దకు చేరుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. డ్రోన్లు మరియు హెలికాప్టర్లను ఉపయోగించి శోధిస్తున్నామని అన్నారు.
- ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత.. ఉపాధ్యక్షుడు మహ్మద్ మొఖ్బర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య మంత్రి, ఎగ్జిక్యూటివ్ వ్యవహారాల డిప్యూటీ ప్రెసిడెంట్ లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించారు.