కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
బాండ్ల రూపంలో విరాళం ఇచ్చిన ఐఆర్‌బీ
మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. అసలే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కుకున్న కేటీఆర్‌ను వరుస కేసులు ఇబ్బంది పెడుతున్నాయి. ఓవైపు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస నోటీసులు ఇస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసుతో ఆయన సతమతం అవుతుంటే ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది.
బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు, వనపర్తి జిల్లాకు చెందిన యుగంధర్ గౌడ్ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫార్ములా ఈ రేసులో ఏసీబీ గురువారం విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను చేర్చిన ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆ సమయంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎన్‌ఎల్ రెడ్డిలకు నోటీసులు రాగా, బుధవారం నాడు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి ముందే అధికారులను ప్రశ్నించి కొన్ని కీలక విషయాలు రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.
ఓఆర్‌ఆర్ లీజు వంతు
హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్వహణను 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన వ్యవహారంలో పారదర్శకత లేదని పేర్కొంటూ ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీనిపై గత ఏడాది జులైలోనే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఆరోపణలు ఏమిటి..?
ఓఆర్‌ఆర్ లీజు వ్యవహారంలో ప్రాథమిక అంచనా రాయుతీ విలువ (ఇనిషియల్ ఎస్టిమేటెడ్ కన్‌సెషన్ వాల్యూ ఐఈసీవీ ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏలు కలిసి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లిమిటెతో ఒప్పందం చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్ధతిలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగానికి, పబ్లిక్ ట్రస్ట్ సూత్రానికి వ్యతిరేకం అంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇఆర్‌ఐ సంస్థ ముంబై పుణే ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా టీవోటీ పద్ధతిలో లీజుకు తీసుకుందని, ఆ హైవే పొడవు 94 కిలోమీటర్లు కాగా, కేవలం 10 సంవత్సరాలకు రూ.8,262 కోట్లు చెల్లించేలా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుందని ఏసీబీకి తాజాగా ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అదే ఓఆర్‌ఆర్ పొడవు 158 కిలోమీటర్లని, 22 టోల్‌ప్లాజాలతో అత్యధిక ట్రాఫిక్ కలిగి ఉందని, కానీ 30 ఏళ్ల కాలానికి కేవలం రూ7,380 కోట్లకే లీజుకు ఇవ్వడం అక్రమమని ఆరోపించారు. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఐఈసీవీను వెల్లడించకపోవడం అక్రమమన్నారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ రోజువారీ టోల్ ఆదాయం రూ.1.2 నుంచి రూ.1.4 కోట్ల మధ్యలో ఉండగా ప్రైవేటు సంస్థకు కేవ లం సగటున రోజుకు రూ. 67 లక్షలే ఇచ్చేలా ఒప్పం దం చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు కూడా ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్వహణను ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌కు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హెచ్‌ఎండీఏ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్‌కు బాండ్ల రూపంలో విరాళం
2023, ఏప్రిల్‌లో టోల్ వసూల్ టెండర్లు దక్కించుకున్కన ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్.. బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చింది. టోల్ లీజుకు ప్రతిఫలంగా సదరు సంస్థ జులై 4న రూ. 25 కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది. వీటిని జులై 13న బీఆర్‌ఎస్ ఎన్‌క్యాష్ చేసుకున్నది. దీనితో పాటుగా వరంగల్‌లోని కైటెక్స్ కంపెనీ కూడా రూ. 15 కోట్లు, సెప్టెంబర్‌లో రంగారెడ్డిలో కైటెక్స్ లో రెండో యూనిట్ ఏర్పాటు సమయంలో రూ. 10 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది.