Sunday, April 20, 2025

ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు…!

  • సాధారణ బదిలీల ప్రక్రియ గందరగోళం
  • డిప్యూటేషన్‌లపై ఎటూ తేల్చకుండానే ట్రాన్స్‌ఫర్‌లు
  • కొన్ని శాఖల్లో ఫోకల్ టు ఫోకల్ బదిలీ
  • క్లారిఫికేషన్ ప్రభుత్వానికి లేఖ రాసిన మరికొన్ని శాఖల ఉన్నతాధికారులు

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ బదిలీల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని పలు శాఖల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల్లో జరుగుతున్న బదిలీలపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్థక శాఖ, డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ తదితర శాఖల్లో జరిగే బదిలీలకు సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయా శాఖల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులే ఎక్కువగా గ్రేటర్ పరిధిలోని పోస్టులను బ్లాక్ చేయించుకుంటున్నారని దీనివల్ల మిగతా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు స్పౌస్ కేసులు, మెడికల్ గ్రౌండ్స్‌కు సంబంధించి కేసులకు చెందిన ఉద్యోగులకే ఈ ముఖ్యమైన పోస్టులను గ్రేటర్ పరిధితో పాటు జిల్లా కేంద్రంలో నియమించడంతో ఈ బదిలీల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు చాలా శాఖల్లో ఫోకల్ టు ఫోకల్ స్థానాలకు కొందరిని బదిలీ చేస్తున్నారని దీనివల్ల భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పశుసంవర్థక శాఖలోనూ నిబంధనలకు తిలోదకాలు…
వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి ఆ శాఖకు చెందిన నర్సులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఇప్పటికే డిహెచ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయంటూ ఆ శాఖ ఉద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. ఇక పశుసంవర్థక శాఖలోనూ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తమకు అనుకూలంగా ఉన్నవారికి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు జిల్లా కేంద్రంలోనూ పోస్టింగ్ ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక కమర్షియల్ ట్యాక్స్‌లో మొదటిపారి చేసిన సీనియార్టీ జాబితా అంతా తప్పుల తడకగా ఉండగా రెండో జాబితాలో వారికి అనుకూలంగా ఉన్న వారికే ఇవ్వాలని కొందరు సీనియర్ అధికారులు చక్రం తిప్పుతున్నారని అందులో భాగంగా ప్రభుత్వానికి క్లారిఫికేషన్ కోసం ఆ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాసినట్టుగా తెలిసింది. ఇక ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదని తమది యూనిఫాం శాఖ కాబట్టి ప్రభుత్వానికి బదిలీకి సంబంధించి క్లారిఫికేషన్ కోసం లేఖ రాసినట్టుగా సమాచారం.

ముఖ్య స్థానాలు బ్లాక్…
అయితే ముఖ్యంగా బదిలీలకు సంబంధించి కొన్ని యూనియన్‌లకు చెందిన నాయకులే గ్రేటర్ పరిధిలోని పోస్టులతో పాటు ముఖ్యమైన స్థానాలను బ్లాక్ చేయించుకుంటున్నారని, దీనికోసం ఆయా సంఘాల యూనియన్ నాయకుల లెటర్ హెడ్‌లను వినియోగించుకుంటున్నారని పలు శాఖల ఉద్యోగులు వాపోతున్నారు. ఈసారి యూనియన్ నాయకులైనా ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తే వారిని కూడా కచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. కానీ, చాలామంది యూనియన్ నాయకులతో పాటు పలువురు యూనియన్‌లతో సంబంధం ఉన్నవారు ఆయా శాఖల హెచ్‌ఓడిలతో మాట్లాడుకొని తమకు నచ్చిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే యూనియన్ అండలేని, యూనియన్‌లో ఏ పదవిలేని ఉద్యోగులే బలిపశువులుగా మారుతున్నారని ప్రస్తుతం ఉద్యోగులు ఆరోపిస్తుండడం విశేషం. ఇప్పటికే పలు శాఖల్లో జరుగుతున్న బదిలీలకు సంబంధించి ఫిర్యాదులు ప్రభుత్వానికి వెలుతుండడంతో ప్రభుత్వం సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు వచ్చినప్పటి నుంచి పలు ఉద్యోగ సంఘాల కార్యాలయాలు ఉద్యోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతిరోజు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘం నాయకులు ఈ బదిలీలకు సంబంధించి 300ల నుంచి 400ల ఫోన్‌కాల్స్ మాట్లాడి రావడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు.

డిప్యూటేషన్‌లపై తేల్చకుండానే….
అయితే కొన్ని శాఖల్లో డిప్యూటేషన్లపై ఎటూ తేల్చకుండానే ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియను చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. గతంలో ఎప్పుడు బదిలీలు జరిగినా డిప్యూటేషన్లలో ఉన్నవారిని వారి సొంత స్థానాలకు పంపించిన తర్వాతే ఈ బదిలీలను చేపట్టేవారు. ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఖాళీల విషయంలో గందరగోళం నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

డిప్యూటేషన్ల విషయంలో ప్రభుత్వం తేల్చకపోవడంతో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు దీనిని ఆసరాగా చేసుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా పలు శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని చాలా ఆఫీసుల్లో బదిలీల జాబితాను ప్రదర్శించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుంగా డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేస్తున్న స్థానాన్ని కూడా ఆప్షన్లలో చూపెట్టడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

పశుసంవర్థక శాఖలో 12 పోస్టులు ముఖ్యనాయకులకే….
ఇక పశుసంవర్థక శాఖలో కూడా పలువురు యూనియన్ నాయకులు ముఖ్యమైన పోస్టులను బ్లాక్ చేయించుకోవడం వల్ల చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఇలా ఆ శాఖకు చెందిన యూనియన్ నాయకులు షీప్ అండ్ గోట్, నారాయణగూడ మల్టీస్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రిలో, పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు పోస్టులు, మేడ్చల్ జిల్లాలోని దేవర యాంజాల్, డబ్లీపూర్, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడు, మహారాజ్‌పేటలో, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ పోస్టును ఇలా పలుచోట్ల ఉన్న పోస్టులను పశుసంవర్థక శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు బ్లాక్ చేయించుకొని వారికి కౌన్సిలింగ్ లేకుండానే ఆయా పోస్టులకు వారు ఎంపికయ్యారని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

తక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులే టార్గెట్
ఒక ప్రదేశంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేయాలన్న నిబంధనకు పలు శాఖల్లో అతిక్రమించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్ కార్యాలయంలో జరిగిన డివిజనల్ అకౌంట్స్ అధికారుల బదిలీలకు సంబంధించి ఉద్యోగుల సీనియారిటీని సక్రమంగా లెక్కించలేదని, కొందరు ఉద్యోగులు ఒకే స్టేషన్‌లో 6 నుంచి 7 సంవత్సరాల సర్వీసు పూర్తి అయినప్పటికీ వారి వివరాలు పూర్తిగా సేకరించకుండా వారిని వదిలివేసి వారి కంటే తక్కువ కాలం పనిచేసిన ఉద్యోగస్తులను బదిలీ చేయాలని నిర్ణయించినట్టు కొందరు ఆ శాఖకు చెందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

దీనివల్ల ఒక ప్రదేశంలో తక్కువ కాలం పనిచేసినప్పటికినీ తాము తప్పనిసరి బదిలీల్లోకి వచ్చామని కొంతమంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వర్కింగ్ స్టేషన్ సీనియారిటీ ప్రకారం ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన సీనియర్ ఉద్యోగులకు పూర్తి వేకెన్సీలను చూపకుండా అందులోని కొన్ని అనుకూలమైన కార్యాలయాలను ఒక ప్రదేశంలో తక్కువ కాలం పనిచేసిన జూనియర్ ఉద్యోగులకు ముందే రిజర్వ్ చేసి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని ఇది పూర్తిగా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని, దీనివలన బదిలీ జాబితాలో ముందున్న తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com