కేరళ, లక్షద్వీప్, బాలీ లాంటి పర్యాటక ప్రాంతాలను తలదన్నే అద్భుతమైన పర్యాటక ప్రాంతం మన తెలంగాణాలోనే ఉంది. అందమైన ప్రకృతికి తోడు చుట్టూ నీళ్లు, బోటు షికారు, ఐలాండ్‌లో వసతి వీటి ప్రత్యేకత. ములుగు జిల్లా లక్నవరంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పర్యాటక ప్రాంతం ఇది. మూడో ద్వీప రిసార్ట్ మనకోసం సిద్ధమైంది. అద్భుతమైన సౌకర్యాలతో వసతి, పసందైన భోజనం, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్ వంటి వాటిని పర్యాటక శాఖ తీర్చిదిద్దింది. లక్నవరంలో చుట్టూ దట్టమైన అడవి, పచ్చటి కొండలు వాటి మధ్యలో పెద్ద జలాశయం అక్కడ ఓ ద్వీపం. మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఈ రిసార్ట్‌లో బస చేయడం గొప్ప అనుభూతిగా పర్యాటక ప్రియులు భావిస్తుంటారు. ప్రకృతి అందాల లక్నవరంలో ఇది మరో ఆకర్షణగా నిలిచిందని ప్రశంశలు వస్తున్నాయి.
తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన మరో ఐలాండ్ టూరిజం పట్ల విస్త్రత ప్రజాదరణ ఉంటుందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా పర్యాటక శాఖ ప్రచారాన్ని సైతం చేపట్టింది. మన లక్నవరం చేరుకోవటం కూడా చాలా సులభం. లక్నవరం హైదరాబాద్‌కు కేవలం 220 కిలో మీటర్ల దూరంలో ఉంది. నాలుగే నాలుగు గంటల్లో లక్నవరం చేరుకోవచ్చును. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి మెరుగైన రవాణా సదుపాయం ఉండడం మరో ప్రత్యేకత. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫ్రీకౌట్స్ సంస్థ లీజు పద్దతిలో రిసార్టును అభివృద్ది చేసి ‘ది కోవ్’ పేరుతో రిసార్టు అందుబాటులోకి తెచ్చింది. అన్ని సౌకర్యాలతో కూడిన 22 ప్రీమియం గదులు, కొన్ని గదులకు అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్స్, అదనంగా కామన్ పూల్, జిప్ లైన్ లాంటి అడ్వంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్, మినీ బీచ్, క్యాంపింగ్ ఇలా ఒక్కటేమిటి మనం అడుగుపెడితే చాలు అన్ని రకాల అనుభూతులను పంచేందుకు ది కొవ్ రిసారట్స్ సిద్దంగా ఉంది.
అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణం, సరదాగా చేపలవేట అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. దీంతో పాటు పర్యాటక ప్రాంతంగా విశేష ఆకర్షణగా కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు క్రమేణా వేదిక అవుతోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ ప్రాంతానికి విచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వినియోగించుకుంటున్నారు. దీంతో లక్నవరం రిసార్ట్ లేటెస్ట్ ఆకర్షణగా మారబోతోందనడంలో ఏమాత్రం సందేహం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రకృతి పర్యాటకానికి ప్రాధాన్యతను ఇస్తూ పర్యావరణహిత టూరిజం అభివృద్ది చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని నిజం చేస్తూ ఈ రిసార్ట్ ముస్తాబవుతోంది.