- డాకింగ్ ప్రక్రియను విజయవంతంచేసిన ఇస్రో
- ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి
- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు గురువారం అంతరిక్షంలో అనుసంధానమయ్యాయి. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో గురువారం ప్రకటించింది. ఇది చరిత్రాత్మక సందర్భమని ఇస్రో తన ట్వీట్‌లో వెల్లడించింది. సుమారు 15 మీటర్ల దూరం నుంచి 3 మీటర్ల దూరం వరకు రెండు శాటిలైట్లను తీసుకువచ్చేందుకు ఇస్రో పలు ప్రయత్నాలు చేపట్టింది. రెండుసార్లు డాకింగ్ ప్రాసెస్‌ను వాయిదా కూడా వేసింది.
కానీ గురువారం ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించింది. డాకింగ్ స్టంట్‌లో సక్సెస్ కావడంతో.. ఆ ప్రక్రియను చేపట్టిన నాలుగవ దేశంగా ఇండియా నిలిచింది. భారత ప్రధాని మోదీ.. ఇస్రో టీమ్‌కు కంగ్రాట్స్ కూడా తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన 220 కేజీల బరువున్న రెండు శాటిలైట్లను నింగిలోకి పంపింది ఇస్రో. 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆ ఉపగ్రహాలు వెళ్లాయి. ఆ తర్వాత ఆ రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసేందుకు ఇస్రో ప్రయత్నాలు చేపట్టింది. తొలుత జనవరి 7, ఆ తర్వాత జనవరి 9వ తేదీల్లో డాకింగ్ ప్రాసెస్‌కు ప్రయత్నించింది.
కానీ రెండు ప్రయత్నాలను వాయిదా వేయాల్సి వొచ్చింది. ఇంతకీ డాకింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. వేగంగా వెళ్తున్న రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను.. ఒకే కక్ష్యలో దగ్గరకు తీసుకువస్తారు. మాన్యువల్‌గా లేదా ఆటోమెటిక్‌గా ఆ ప్రక్రియను చేపడుతారు. ఆ తర్వాత రెండు ఉపగ్రహాలు లేదా స్పేస్‌క్రాఫ్ట్‌లు.. అంతరిక్షంలో ఒక్కటవుతాయి. ఆ అనుసంధాన ప్రక్రియను డాకింగ్ అని పిలుస్తారు. ఒకవేళ భారీ పేలోడ్లను నింగిలోకి ఒకేసారి మోసుకెళ్లలేని పక్షంలో.. వేర్వేరు పేలోడ్లతో వెళ్లిన ఉపగ్రహాలను, స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలో డాకింగ్ చేస్తారు. 2035లోగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని ఇండియా భావిస్తున్నది. 2040లోగా మనుషుల్ని చంద్రుడిపై పంపే యోచనలో కూడా ఉంది. అయితే ఆ లక్ష్యాలు నిజం కావాలంటే, వాటికి అనువైన వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఇస్రో ప్రయోగాలు చేపడుతున్నది. కీలకమైన టెక్నాలజీపై దృష్టి పెట్టింది. హెవీ రాకెట్ల ద్వారా మోసుకెళ్లే పేలోడ్లను .. అనుసంధానం చేయాలంటే డాకింగ్ పక్రియ కీలకమైంది.
అయితే ఆ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. చంద్రయాన్4 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి మీద నుంచి శ్యాంపిళ్లను తెచ్చేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే దానికి కూడా డాకింగ్ సామర్థ్యం అవసరం ఉంటుంది. శాటిలైట్లు అనుసంధానం అయిన తర్వాత ఒక్కటి అవుతాయి. వాటి మధ్య ఎలక్ట్రికల్ పవర్ షేర్ అవుతుంది. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు రెండు శాటిలైట్లకు కమాండ్లు పంపిస్తారు. ఒకవేళ కమాండ్లు సక్సెస్ అయితే, ఆ తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ అన్‌డాక్ అవుతుంది. రెండేళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలు జరుగుతాయి. సాధారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు రెగ్యులర్‌గా డాకింగ్ ఉంటుంది. ఆస్ట్రోనాట్లు వొచ్చి వెళ్తున్న ప్రతిసారి.. స్పేస్ స్టేషన్‌తో స్పేస్‌క్రాఫ్ట్ అనుసంధానం జరుగుతూనే ఉంటుంది. డాకింగ్ టెక్నాలజీలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటే, భవిష్యత్తు ప్రయోగాలు మరింత సులువు కానున్నాయి.