భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలకు సిద్దమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ 3 విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఇస్రో.. ఇప్పుడు చందమామపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రయోగాలకు సంబందించిన అంశాలపై దృష్టి సారించింది ఇస్రో. చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రయోగాలకు సంబంధించిన ప్రాజెక్టు డిజైన్లు పూర్తి చేశారు ఇస్రో సైంటిస్టులు. ఈ డిజైన్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు ఇస్రో చైర్మెన్ సోమనాధ్ చెప్పారు.
జాబిల్లిపై నీరు, వాతావరణం, ఇతర లోహాల అన్వేషణలో భాగంగా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, చందమామపై నుంచి రాళ్లు, మట్టిని భూమికి తీసుకువచ్చేందుకు చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రయోగాలు చేపడుతోంది. ఈ క్రమంలో చంద్రయాన్ 4 మిషన్ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
వచ్చే ఐదేళ్లలో సుమారు 70 శాటిలైట్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మెన్ సోమనాధ్ తెలిపారు. ఇందులో ప్రధానంగా జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో వరుస ప్రయోగాలకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ INSAT 4D, రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలకు సైతం ఇస్రో సమాయుత్తం అవుతోందని సోమనాధ్ వివరించారు.ఐతే శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించిన ఇస్రో చైర్మెన్.. మానవ రహిత గగన్ యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరులో చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. గగన్ యాన్ ప్రాజెక్టు కు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నాయని చెప్పారు.