విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు
రశీదులు ఇవ్వకుండా ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రధాన కార్యాలయంతో సహా ఏపీ, విజయవాడ, ముంబై, బెంగళూరులో తనిఖీలు
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాల్లో చేపట్టారు.
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలపై ఒక్కసారిగా దాడులు చేపట్టారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ రిసీట్ ఇవ్వకుండా పెద్దఎత్తున ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముందుగా హైదరాబాద్ మాదాపూర్‍లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం.
అనంతరం వరసగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లోనూ పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగా నగదు తీసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్.. అలాగే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. నగదు రూపంలో అధికంగా ఫీజులు వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం తక్కువగా చూపించారని ప్రాథమిక విచారణలో గుర్తించారని సమాచారం. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు లెక్కలు చూపించి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.