Sunday, April 13, 2025

jack review అది రా సామీ..!

సిద్ధూ.. మూడోసారి కలిసిరాలేదు

సిద్ధూ జొన్నలగడ్డ.. పేరు వినగానే సినీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది టిల్లు క్యారెక్టర్. ఎందుకంటే యూత్‌కి అంతగా కనెక్ట్ అయింది ఈ పాత్ర. అందుకే టిల్లు ఏం చేసినా ప్రేక్షకులు నవ్వారు. అలాంటి సిద్ధూతో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తీస్తున్నారనగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక ఈ కాంబోకి ‘బేబీ’ వైష్ణవి చైతన్య తోడైంది. మరి ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘జాక్’ సినిమా.. కొంత తేడా కొట్టింది. ఈ సినిమా రివ్యూ చూసే ముందు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు భాస్కర్ చెప్పిన ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. “జాక్ సినిమా ఒక రాయికి ఒక శిల్పానికి మధ్య జరిగిన కథ.. తాబేలుకి, కుందేలుకి మధ్య జరిగిన కథ.. ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి మధ్య జరిగిన కథ.” అంటూ భాస్కర్ చెప్పారు. ఇంత చెప్పిన భాస్కర్‌.. సినిమాలో ఏం చేశాడో చూద్దాం.

డీజె టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాతే సిద్దు జొన్నలగడ్డ రేంజ్ ఒక్క సారిగా మారి పోయింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా లెక్కలోకి వేసుకోతగ్గవి కావు అనే చెప్పాలి. వరసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత అదే హీరో మూడవ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే దానిపై అంచనాలు భారీగా ఉండటం సహజమే. పైగా బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు భాస్కర్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ కావటంతో జాక్ పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అయితే జాక్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. సిద్దూ హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది. బొమ్మరిల్లు భాస్కర్ మరో సారి ప్రేక్షకులని నిరాశపరిచాడు అనే చెప్పాలి. సినిమా లో ప్రేక్షుకులు పూర్తి స్థాయిలో ఎంగేజ్ కావాలంటే కామెడీ అయినా ఉండాలి.. లేదు అంటే కథ అయినా అంత గ్రిప్పింగా ఉండాలి. కానీ జాక్ సినిమా లో మాత్రం ఈ రెండూ లేవు. దీంతో ఇది మరో రొటీన్ రా సినిమాగా మిలిగిపోయింది. జాక్ లాంటి కథతో ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. తన కొడుకు కు దేనికి పనికి రాకుండా పోతాడు అనే టెన్షన్ లో తండ్రి … ఎలాగైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు అనే నమ్మే తల్లి . మరి ఎవరి మాట నిజం అయింది…హీరో తాను అనుకున్న రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో ఉద్యోగం సాదించాడా లేదా అన్నదే సినిమా.

అయితే సిద్దు జొన్నలగడ్డ తన పాత సినిమాల ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఒక యాక్షన్ సినిమా చేసినా ఈ సినిమా కథలో అంత బలం లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది . ఇందులో సిద్దూ తనకు అలవాటు అయిన స్టైల్ లో ప్రేక్షకులను అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ సినిమాను నిలబెట్టడానికి ఇది ఏ మాత్రం సరిపోలేదు. హీరోయిన్ వైష్ణవి కూడా ఈ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్న ఇందులో ఆమె పాత్రకు కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు . సిద్దూ యాక్షన్ పరంగా మంచిగానే చేసినా ఇది వర్క్ అవుట్ కాలేదు . దీంతో జాక్ మూవీ ఒక రొటీన్ టాలీవుడ్ మూవీగా మిగిలింది అనే చెప్పాలి. కథలో దమ్ములేకపోయినా కూడా సినిమాకు మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అనే చెప్పాలి.

సినిమా ఏమిటంటే..
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధూ జొన్నలగడ్డ)కి చిన్నప్పటి నుంచీ దేని మీదా ఎక్కువ కాలం ఇంట్రెస్ట్ ఉండదు. క్రికెట్‌తో మొదలు పెట్టి ఆడిన ప్రతి ఆటలోనూ, చేసే ప్రతి పని లోనూ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో మధ్యలోనే దాన్ని వదిలేసి వేరే పని మీద దృష్టి పెడతాడు. దీంతో ఎందులో జాయిన్ అయినా సరే జాక్‌కి ట్రైనింగ్ ఇవ్వలేమని చాలా మంది కోచ్‌లు, ట్రైనర్లు చేతులెత్తేస్తారు. దీంతో తనకి ఏది నచ్చితే ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ చేసే ప్రతి పనిని చాలా పక్కాగా చేస్తాడు. అలా మొత్తానికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాలని గట్టిగా డిసైడ్ అవుతాడు. ఇందుకోసం చాలా కష్టపడతాడు. ‘రా’ ఇంటర్వ్యూ వరకూ వెళ్తాడు. తనకి పక్కాగా జాబ్ వస్తుందని.. సెలెక్ట్ అయ్యేవరకు మనలోని దేశభక్తి ఆగుతుందా అంటూ ముందే తన మిషన్ మొదలుపెడతాడు.

అందులో భాగంగా ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థ హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్‌ని ఆపే క్రమంలో ఒక స్లీపర్ సెల్‌ని జాక్ పట్టుకుంటాడు. అయితే ఒక కన్ఫ్యూజన్‌లో ‘రా’ ఏజెంట్ అయిన మనోజ్ (ప్రకాష్ రాజ్)ని కూడా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఒక పక్క రా టీం అలాగే టెర్రరిస్ట్ బ్యాచ్ కూడా జాక్‌ని ట్రేస్ చేసే పనిలో పడతారు. ఈ మధ్యలో అసలు తన కొడుకు జాక్ ఏ పని చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతని తండ్రి(నరేష్) తాపత్రయపడుతుంటాడు. ఇది తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ (వైష్ణవి)ని సంప్రదిస్తాడు. మొత్తానికి ఆ లేడీ డిటెక్టివ్ కారణంగా జాక్ ‘రా’ టీంకి చిక్కుతాడు. అప్పుడు అసలు జాక్‌ని రా టీమ్ సెలక్ట్ చేయలేదని తెలుస్తుంది. ఆ బాధతో ఎలాగైనా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని పట్టుకోవాలని జాక్ నేపాల్ వెళ్తాడు. మరి ఇందులో జాక్ సక్సెస్ అయ్యాడా? రా టీమ్ తర్వాత ఏం చేసింది? అనేది మిగిలిన కథ.

అది మిస్ అయిందిగా
‘రా’ అనేది ఎంత పెద్ద ఏజెన్సీ అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలోని ది బెస్ట్ ఏజెన్సీ ‘రా’. అలాంటి ‘రా’లో జాబ్ సంపాదించడమే చాలా కష్టమైన పని. కానీ అలాంటి రా ఏజెన్సీకే టోకరా వేసి ఓ యువకుడు.. టెర్రరిస్ట్ గ్రూప్‌నే పట్టుకోవడం అనేది వినడానికి చాలా వింతగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దేశాన్ని కాపాడే రా ఏజెన్సీనే ఓ యువకుడు కాపాడటం అనేది ఇంకా వింత. అయితే ఎంత మాట్లాడుకున్నా ఇది సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎంత సినిమా అయినా వాస్తవాలకి దగ్గరగా ఉండటం చాలా ముఖ్యం. జాక్‌లో అదే మిస్ అయింది.

సాధారణంగా భాస్కర్ చిత్రాలపై ఆడియన్స్‌కి చాలా నమ్మకం ఉంటుంది. బొమ్మరిల్లు నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకూ ఆయన సినిమాలన్నీ సరిగ్గా గమనిస్తే హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా బలంగా ఉంటాయి. ప్రతి పాత్రని చాలా స్ట్రాంగ్‌గా రాస్తారు భాస్కర్. అందుకే సినిమా ఫలితం ఏదైనా సరే ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనికి సరైన ఉదాహరణ ఆరెంజ్. ఇక జాక్ విషయానికొస్తే హీరో పాత్రని ఆయన డిజైన్ చేసిన విధానం బావుంది. కానీ వాస్తవానికి అది ఎంత దగ్గరగా ఉందనేది ఆయన మిస్ చేశారు.

అసాధ్యమైన పనులు హీరోలు చేయడం మన సినిమాల్లో సహజమే. కానీ ఒక దేశ ఏజెన్సీ కంటే గొప్పగా ఆ హీరో ఉండటం, పనులు చేయడం అనేది ఆడియన్స్‌కి కూడా నమ్మేలా అనిపించలేదు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర కూడా మొదట్లో కాస్త బలంగా అనిపించినా చివరికి వచ్చేసరికి తేలిపోయింది. భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి ఉన్నంత బలం ఈ చిత్రంలో వైష్ణవి క్యారెక్టర్‌కి దక్కలేదు. ఇక రా ఏజెంట్‌ టీమ్ హెడ్‌గా ఉన్న ప్రకాష్ రాజ్‌నే హీరో కిడ్నాప్ చేయడం, టెర్రరిస్టులని ఏజెన్సీ కంటే ముందే హీరో పట్టేసుకోవడం, ఒక పెద్ద ఏజెన్సీనే దేశాన్ని కాపాడలేమంటూ చెప్పడం, ఆ పనిని జాక్ చేయడం ఇలా ప్రతిదీ ఆ ఏజెన్సీ ఎఫిషియన్సీని తక్కువ చేసి చూపించినట్లు అనిపించింది. అయితే హీరో క్యారెక్టరైజేషన్, తల్లితో సెంటిమెంట్ ఇలా కొన్ని వర్కవుట్ అయ్యాయి. అక్కడక్కడా సిద్ధూ పేల్చిన ఒన్ లైనర్లు కూడా ఫర్లేదు. యాక్షన్ సీక్వెన్సులు కూడా ఫర్వాలేదనిపించాయి. కానీ మెయిన్ మిషన్ మిస్ అవ్వడమే సినిమాకి పెద్ద మైనస్.

ఇక సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్లేదు. పాటలు అయితే మరీ గుర్తుపెట్టుకునేట్లుగా అయితే ఏం లేవు. నవీన్ నూలి మరోసారి తన ఎడిటింగ్‌తో మూవీని బాగానే కాపాడారు. సోది లేకుండా చాలా క్రిస్పీగా ఎడిట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఇక భాస్కర్ విషయానికొస్తే ఈ సినిమాపై ఆయన చాలా నమ్మకంగా ఉన్నట్లు చెప్పారు. అయితే సిద్ధూ మీద ఎంత నమ్మకం ఉంచారో అదే నమ్మకం స్క్రిప్ట్‌పై కూడా పెట్టి ఉంటే బాగుండేది. తన స్టయిల్‌కి భిన్నంగా భాస్కర్ చేసిన జాక్ అయితే మరీ గొప్పగా ఏం లేదు.

అర్థం కాలే భాస్కరా..
ఇక సినిమా చివరిలో ఓ డైలాగ్ స్క్రీన్ మీద పడింది.”ఓ శిలై ఉన్నానని భూమి కుంగునా? నే ఒక శిల్పాన్నని దైవం తుళ్లునా? మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది.. శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా? రెంటి మధ్యన..!” మరి దీనికి అర్థం ఏంటో.. దీనికి సినిమాకి లింక్ ఏంటో భాస్కర్‌కే తెలియాలి. అది మాత్రం ఒక్క ప్రేక్షకుడు.. తెలుగు తెలిసిన ప్రేక్షకుడికి కూడా అర్థం కాని వింత డైలాగ్‌.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com