- సభ అందరిదీ.. మీ సొంతం కాదు
- అసెంబ్లీలో దుమారం
- బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్ డిమాండ్
- గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తొలుత జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు‘ అని వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పులేదన్నారు. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినది కాదన్నారు. ఈ క్రమంలో దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. దళితులంటే బిఆర్‌ఎస్‌కు పడదని, అందుకే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార పార్టీ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభరు 15 నిముషాలు వాయిదా వేశారు. అంతకుముందు మంత్రి కోమటి రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య కాసేపు మాటల తూటాలు పేలాయి.
పదేళ్లలో ఏమీ చేయలేని బిఆర్‌ఎస్..ఇవాళ కాంగ్రెస్‌ను తప్పుపడుతోందని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ, రైతుభరోసాపై ప్రభుత్వం విమర్శలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి కోమటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు భరోసా ఎప్పుడిచ్చారు, రుణమాఫీ ఎక్కడ చేశారు. ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చారు. గవర్నర్ 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పారు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు రన్నింగ్ కామెంట్రీ చేయడం మానుకోవాలని జగదీష్ రెడ్డి సూచించారు.
జగదీష్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి కోమటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తామని బీఆర్‌ఎస్ చేసిందా? మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిందా?ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పూర్తి చేసినవేనన్నారు. బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. మీరు పదేళ్లలో చేయలేనిది..తాము 14 నెలల్లో చేశామని కోమటిరెడ్డి అన్నారు.