- ఏపీలో జగన్, కాంగ్రెస్ ఒక్కటే
- జగన్ కోసం ఒక్కటయ్యారు
- రెండు పార్టీలను నడిపించేది కుటుంబ సభ్యులే
- చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ
టీఎస్, న్యూస్:
ఏపీలో జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందని, ఈ రెండు పార్టీలు వేరు కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు పార్టీలను ఏపీలో నడిపించేది కుటుంబ సభ్యులేనని సీఎం జగన్, కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలుకలూరిపేట బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్రంలో ముచ్చటగా మూడో సారి ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి రావాలని, ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లు కావాలని, అందుకు ఆంధ్రా కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని, అప్పుడే వికసిత భారత్ తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుంది అని ప్రధాని కోరారు. ముందుగా “నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలు.. కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నా.. ముచ్చటగా మూడో సారి అధికారం లోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఈసారి ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలి..” అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400 కంటే సీట్లు వచ్చేలా కృషి చేయాలని, ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ భావాలతో పాటు, జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తుందని, ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుందని మోడీ ఆకాంక్షించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలని, ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారత దేశం అని, ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని, ఎన్డీయే సర్కారులో ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేస్తారని వివరించారు.
10 లక్షల ఇండ్లు ఇచ్చాం
ఏపీ ఆవాస్ యోజన కింద 10 లక్ష ఇళ్లు ఇచ్చామని ప్రధాని మోడీ వెల్లడించారు. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు తాగు నీరు అందించామని, కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ. 700 కోట్లు ఇచ్చామని, ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగిందని వెల్లడించారు. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూరివర్సిటీని ఏర్పాటు చేశామని, విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించామని, పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పామని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీటిని స్థాపించామని, ఇండియా కూటమి లోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయని, కాంగ్రెస్, లెఫ్ట్ డిల్లీలో మాత్రమే కలిసి పోతాయని మండిపడ్డారు.
తెలుగోళ్లను గౌరవించింది మేమే
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా రూ. 100 వెండి నాణెం విడుదల చేశామని ప్రధాని మోడీ చెప్పారు. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారని, ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరం అని, తెలుగు వారికి కాంగ్రెస్ చేసిన అవమానం తోనే టీడీపీ పెట్టిందని గుర్తు చేశారు. తెలుగు వాళ్ల ముద్దు బిడ్డ పీ.వీ. నరసింహా రావుకు ఎన్డీయే ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించిందని ప్రధాని చెప్పారు.