Thursday, May 8, 2025

జగన్‌… చిన్న జియర్‌స్వామి శిష్యుడు- కేఏపాల్‌

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడితే చాలు అది ఒక వార్త అయిపోతది. ఆయన మాట్లాడేది నిజమా ఆబద్ధమా అన్న విషయం పక్కనపెడితే ముందు అదొక పెద్ద వార్తలా చేసేస్తారు మన సోషల్‌ మీడియావాళ్ళు. అనంతపురం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడని, చిన్నజీయర్ స్వామికి శిష్యుడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించి హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని ఆరోపించారు. జగన్ ఎన్నడూ తనను కలవలేదని, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు.

రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులైనా ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని పాల్ విమర్శించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సీమకు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఆర్డీటీ సంస్థ సత్యసాయిబాబా కంటే ఎక్కువగా ప్రజలకు సేవలందించిందని కొందరు అంటున్నారని చెప్పారు. అలాంటి సంస్థకు ఎన్నికల పేరుతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను నిలిపివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి నేతలే దీనిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంలో రెండో కీలక వ్యక్తితో మాట్లాడానని, ఆర్డీటీకి న్యాయం జరగకపోతే ప్రపంచాన్ని దించుతానని హెచ్చరించారు. ఇదే తన డెడ్‌లైన్ అని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు 30 వేల మంది అదృశ్యమైన అమ్మాయిల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయారని, ఒకప్పుడు మోదీని విమర్శించి ఇప్పుడు ఆయనే గొప్ప ప్రధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైతం గతంలో మోదీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు విశ్వగురు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని విమర్శించారు. లోకేశ్ అయితే మోదీని వంద మిసైళ్లతో పోల్చారని, కానీ ఆ మిసైల్ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే ‘పడిపోయే మిసైల్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, జగన్, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలంతా మోదీకి తొత్తులుగా మారిపోయారని పాల్ ఆరోపించారు. వారెవరూ మోదీని ధైర్యంగా ఎదుర్కోలేరని, ఆ దమ్మున్నది కేవలం తనకు మాత్రమేనని అన్నారు. ఏపీ, తెలంగాణల్లో చెరో వంద సీట్లలో తన పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతానని, లేదా 42 ఎంపీ సీట్లిస్తే ప్రధానమంత్రి అయి దేశాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com