దాయాది పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు విమానాలను, ఎయిర్‌పోర్ట్‌లను, క్రికెట్ స్టేడియాలను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
స్టేడియానికి ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఈమెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈమెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్ శర్మ తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. మే 9న కూడా జైపూర్ స్టేడియానికి ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఈమెయిల్ పంపారు. స్టేడియంలో పేలుడు జరగవచ్చని హెచ్చరించారు.