పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూకశ్మీర్ లోని జైళ్లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైళ్లలో ఉన్న తమ లీడర్లను విడిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని జైళ్లకు ఉన్నతాధికారులు భద్రతను మరింతగా పెంచారు. పహల్గామ్ ఉగ్రదాడికి సహకరించారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న వారిని అధికారులు ఈ జైళ్లలోనే ఉంచారు. ఆర్మీ వెహికిల్ పై దాడి కేసు నిందితులు నిస్సార్, ముష్తాక్ సహచరులు కూడా ఇదే జైళ్లలో ఉన్నారు.
ఈ క్రమంలోనే జైళ్లపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అప్రమత్తమైంది. జైళ్ల భద్రతపై సీఐఎస్ఎఫ్ డీజీ ఇటీవల శ్రీనగర్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.