- ఆశావహుల్లో జానారెడ్డి, నిరంజన్, అజారుద్దీన్, విహెచ్‌లు
- సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపి అభిషేక్ మను సింఘ్వి వైపు ఏఐసిసి మొగ్గు
రాజ్యసీభ సీటు కోసం తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. బిఆర్‌ఎస్ తరఫున గెలిచిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.కేశవరావు గత నెల 31వ తేదీన తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఈ ఖాళీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దేశం మొత్తం మీద 9 రాష్ట్రాల్లోని 12 ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేయగా తెలంగాణలోని ఒక స్థానానికి సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది.
అయితే ఈ సీటును తమకంటే తమకు కేటాయించాలని పలువురు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి తమ వినతులను ఇస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆ ఒక్క సీటును ఆశిస్తున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి, వి.హనుమంతరావు, నిరంజన్, అజారుద్దీన్ తదితరులు ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపి అభిషేక్ మను సింఘ్వికి ఇప్పించాలని ఏఐసిసి అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది.
ఒకే ఇంట్లో ముగ్గురికి పదవులు ఇవ్వదు….
అయితే రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రం రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకే ఆ సీటును కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి (అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు) అనిల్‌కుమార్ యాదవ్‌కు రాజ్యసభ అవకాశం కల్పించగా, మరొకరికి కూడా ఈ అవకాశం కల్పిస్తే కచ్చితంగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను గెలిచే అవకాశం ఉంటుందని కొందరు నగరానికి చెందిన నాయకులు ఏఐసిసికి విన్నవించినట్టుగా తెలిసింది. అయితే ఈ సీటును ఆశిస్తున్న వారిలో జానారెడ్డి మాత్రం చివరిసారిగా తనకు ఈ అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపిగా గెలిచారు. దీంతో ఒకే ఇంట్లో ముగ్గురికి అధిష్టానం పదవులు ఇవ్వదని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
బిసిల కోటాలో అవకాశం కల్పించాలి: విహెచ్ డిమాండ్
ఇక హైదరాబాద్‌కు చెందిన నిరంజన్ పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ పటిష్టతకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు కూడా ఈసారైనా అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక అజారుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో తనకు ఏదైనా పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సీటు కోసం ఆయన పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. ఇక వి.హనుమంతరావు కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలని పార్టీకి విన్నవించుకున్నారు. కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ టికెట్‌ను అధిష్టానం ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారైనా హైదరాబాద్ కోటా నుంచి బిసిల కోటాలో తన పేరును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇలా ఎవరికి వారే ఈ సీటు కోసం ప్రయత్నం చేయడం విశేషం.
14వ తేదీన ఉప ఎన్నిక నామినేషన్లు
కేశవరావు రాజీనామా చేసిన సమయంలోనే మాజీ ఎంపి అభిషేక్ మను సింఘ్వి పేరు వినిపించగా ఇప్పటికీ ఏఐసిసిలో అదే వైఖరి కొనసాగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉప ఎన్నిక కోసం నామినేషన్లు ఈ నెల 14న ప్రారంభం కానుండగా అప్పటిలోపు సిఎం రేవంత్ విదేశీ టూర్ ముగించుకొని హైదరాబాద్ వస్తారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సీటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటు న్నాయి. తెలంగాణ నుంచి ఈ ఒక్క స్థానం భర్తీ అవుతున్నందున సొంత రాష్ట్రానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడంపై గాంధీభవన్‌లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తుండడం విశేషం.