Wednesday, March 19, 2025

జన్వాడ డ్రోన్‌ కేసు సీఎం రేవంత్‌ రెడ్డికి రిలీఫ్‌

సీఎం రేవంత్‌ రెడ్డిపై 2020లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మందిపై నార్సింగి పీఎస్‌లో 2020 మార్చిలో కేసు నమోదైంది. అప్పుడు ప్రతిపక్షంలో రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జన్వాడ నిషేధిత ప్రాంతమేమి కాదని, సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని ధర్మాసనానికి తెలిపారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం ఎటువంటి నిషేధిత జాబితాలో లేదని పీపీ న్యాయస్థానానికి వివరించారు. దీంతో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం నార్సింగి పీఎస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

మరో కేసులో కేటీఆర్‌కు ఊరట
మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కూడా కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపర్చే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్‌ కుమార్ యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడంతో దానిని కొట్టేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంలో బాధ్యత గల హోదాలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ ఇష్టారీతిన మాట్లాడారని, సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షల కారణంగానే మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని ఆయన తరఫున న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ఇటీవల ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు పిలిచి ఆయన నుంచి పోలీసు ఉన్నతాధికారులు వాంగ్ములాలను సేకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com