- ప్రధాని మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
- అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి
ప్రచారంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రధాని మోడీ వ్యవహారించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోడీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రధాని మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించి హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా రామ్‌లల్లా గేట్స్ తెరిపించారని ఆయన గుర్తు చేశారు. రామాలయం గేట్లు తెరిచినప్పుడు మోడీ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 1989 శిలన్యాస్ చేశారని, గుడి శంకుస్థాపనకి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీయేనని, రాజీవ్ గాంధీ బ్రతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు.
బిజెపి ఎన్నికల కోసం గుడిని వాడుకుంటోంది
బిజెపి ఎన్నికల కోసం గుడిని వాడుకోవడం వల్లే ఈ వివాదం ఏర్పడుతుందన్నారు. దేశంలో ధార్మిక చింతనను పెంపొందించింది రాజీవ్ గాంధీ అని, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు దూరదర్శన్‌లో రామాయణ, మహా భారతాలు ప్రసారమయ్యాయని, ఆదర్శ దేవుడిగా పాలనలో ప్రజాభిప్రాయాన్ని విలువని ఇచ్చింది శ్రీరాముడని, దూరదర్శన్‌లో ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ అయ్యాయి? హిందువుల మనోభావాలు గౌరవించేది గాంధీ కుటుంబమని ఆయన చెప్పారు. సెక్యులరిజం అంటే అందరి భావలను గౌరవించడమేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల కోసం బిజెపి దేవుడిని వాడుకోవడం మంచిది కాదన్నారు. యూపి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారనన్న మోడీ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మోడీ విద్వేషపూరితంగా, చౌకబారు ఆరోపణలు చేశారని, ప్రధాని స్థాయిని దిగజార్చరని జీవన్‌రెడ్డి విమర్శించారు. మత సామరస్యానికి కట్టుబడి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు.