తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢబోనాలు జూన్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించనున్నారు. జులై 13 ఆదివారం లష్కర్ బోనాలు, జూలై 20 ఆదివారం రోజు లాల్ దర్వాజా సింహవాహినికి బోనం సమర్పించనున్నారు. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజు ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు జూలై 24 ఆషాఢ అమావాస్యతో ముగుస్తాయి.
లష్కర్ బోనాలను 2 రోజులపాటు నిర్వహిస్తారు. లష్కర్ బోనాలు ముగిసిన మర్నాడు రంగం నిర్వహిస్తారు. బోనాలు వేడుకలో భాగంగా పోతరాజుల విన్యాసాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్ లో ఘనంగా జరుగుతాయ్ ఆషాఢ బోనాలు. భాగ్యనగరంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా మహంకాళిని పూజించి, గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. మట్టికుండలో బోనం వండి అమ్మకు సమర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కరువు కాటకాలు లేకుండా చేయాలని, అంటువ్యాధుల నుంచి కాపాడాలని వేడుకుంటారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ సమయంలో మహంకాళికి బోనం సమర్పించి బయపడ్డారు ప్రజలు. ఆ వ్యాధినుంచి బయటపేడేసినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఎలా ఏటా ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.
బోనాల షెడ్యూల్
జూన్ 26 గోల్గొండ అమ్మవారికి తొలిబోనం
రెండో పూజ జూన్ 29 ఆదివారం
మూడో పూజ జూలై 3 గురువారం
నాలుగో బోనం జూలై 6 ఆదివారం
ఐదో పూజ జూలై 10 గురువారం
ఆరో పూజ జూలై 13 ఆదివారం
ఏడో పూజ జూలై 17 గురువారం
ఎనిమిదో పూజ జూలై 20 ఆదివారం
చివరిగా జూలై 24 గురువారంతో ఉత్సవాలు ముగింపు