రూ. 1000 కోట్ల డీల్ ఇచ్చారా..? రేవంత్‌ను ప్రశ్నించిన కేఏ పాల్
తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్, అదనపు షోలు.. టికెట్ల పెంపుదల ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గేమ్ ఛేంజర్ మూవీకి అవన్నీ ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణ హైడ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరోసారి బయటకు వచ్చిందని కేఏ పాల్ విమర్శించారు. మొన్నే అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ ఘటనపై మర్డర్ కేసు పెట్టించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచను అన్నావు.
మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు నువ్వు టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు. నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బెనిఫిట్ షోలను రద్దు చేయి.. నీకు రూ.100 కోట్లు, రూ. 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఒక రెడ్డి(దిల్ రాజు) వచ్చి రెడ్డికి చెప్తే డీల్స్ చేసుకుంటారా అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సత్తా ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపించాలని కేఏ పాల్ పేర్కొన్నారు.