ఇంటికి వెళ్లిన సిబ్బందిపై కుక్కలను వదిలారు
రాష్ట్రంలో కుల గణన సర్వే ముగిసింది. కులాల వారీగా ఎంత మంది ఉన్నారో లెక్కలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయం చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కులగణనలో వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత తప్పా ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలను వదిలిన వారూ ఉన్నారని అన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదని చెప్పారు. కులగణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని చెప్పారు. బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలని అన్నారు.
కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు
కులగణన ఒక ఉద్యమంలాగా చేశామని మంత్రి పొన్నం చెప్పారు. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలిందని, క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కులగణన చేస్తామని మాట ఇచ్చామని.. చేసి చూపించామన్నారు. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కులగణన కోసం పోరాటం చేసిన వారందరిని ప్రశంసించారు. ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకు రావాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.