బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 303, 306 సర్వే నంబర్లలో ఉన్న 2500 గజాల ప్రభుత్వ స్థలాన్నిహైడ్రా స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి ఈ స్థలం యూఎల్‌సీ ల్యాండ్ కాగా.. సయ్యద్ బషీరుద్దీన్, సయ్యద్ అమీదుల్లా హుస్సేన్ కబ్జా చేశారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని తన పేరుమీద రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా.. అందులో అనుమతులు లేకుండా షెడ్డులు, రూంలు నిర్మించారు. ఈ మేరకు ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోందని, కాపాడాలని స్థానికుల నుంచి ప్రజావాణికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. హైకోర్టు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని 2 నెలల క్రితం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అక్కడ నిర్మించిన ఆర్‌సీసీ రూములు 4, రేకుల షెడ్డులు, షాపులు 4 వరకూ కూల్చివేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, కబ్జా చేసిన వారికి చెందిన వారు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసుల సహకారంతో వారిని అడ్డుకుని కూల్చివేతలను కొనసాగించింది. ప్రభుత్వ భూమిని కాపాడగలిగామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణల తొలగింపును చేపట్టిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
నేడు హైడ్రా పోలీసు స్టేషన్ ప్రారంభం
ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీసు స్టేషన్ తోడయ్యింది. హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పోలీస్ స్టేషన్‌ను గురువారం ప్రారంభిస్తున్నారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరే సొంతంగా పోలీసు స్టేషన్ తోడవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం సమకూరనుంది. ఈ పోలీసు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ పి. తిరుమల్ నియమితులయ్యారు. ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్ ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీసు స్టేషన్‌కు సమకూరనున్నారు. జీ ప్లస్ 2గా నిర్మాణమైన ఈ పోలీసు స్టేషన్‌లో 10500ల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీసు స్టేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంది. ఈ పోలీసు స్టేషన్‌కు సమకూరిన అధికారాల మేరకు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు కూడా చేస్తుంది. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా కేసులు బుక్ చేస్తుంది. మట్టిని తరలించే వాహనదారులపైనే కాకుండా.. మట్టిని తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యక్తితో పాటు.. ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థకు చెందినదో తెలుసుకుని వారిపైన కూడా హైడ్రా పోలీసు స్టేషన్ కేసులు నమోదు చేస్తుంది. చెరువుల్లోకి మురుగునీరును నేరుగా వదిలిన వారిపైనా కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
సూత్రదారులెవరో తేల్చనుంది——————————–
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో హైడ్రా పోలీసు స్టేషన్ తేల్చనుంది. పేదవాళ్ల రూపంలో గుడిసెలు వేయించి.. తర్వాత కాజేసే బడా వ్యక్తుల భరతం పడుతుంది. నకిలీ పత్రాలు సృష్టించి లే ఔట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలనుకునేవారి గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తుంది. వాల్టా యాక్టు, ఫైర్ చట్టాల ఉలంఘనులను నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తుంది. లే ఔట్లలో రహదారులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని ప్రకటనల హోర్డింగుల యజమానులను నియంత్రిస్తుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుంది. అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటుంది.
లే ఔట్లలో కొన్ని ప్లాట్లు కొని.. పక్కన ఉన్న వారి ప్లాట్లు కలిపేసుకుని పాత లే ఔట్లను చెరపట్టిన వారిపై హైడ్రా పోలీసు స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తుంది. లే ఔట్‌లో రహదారులు, పార్కులతో పాటు.. సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి న్యాయం జరిగేలా చూస్తుంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థతిని తెలుసుకుని.. బాధ్యులపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల భూములను, పలు చెరువులు, పార్కులు, నాలాలను కాపాడింది. ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్లలో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడా కేసులన్నిటిని హైడ్రా పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాయి. సమస్య మూలాల్లోకి వెళ్లి ఆక్రమణదారులను సరైన ఆధారాలతో జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీసు స్టేషన్ పని చేస్తుంది.