పహల్గామ్‌లో మారణహోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టునపెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర అడవుల్లోనే ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పహల్గామ్ ఉగ్ర ఘటన జరిగిన ప్రాంతం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర అడవుల్లో గాలించారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటకుండా డ్రోన్లు,హెలికాప్టర్లు, సాంకేతిక వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దచిగామ్, కుల్గాం, షోపియాన్ అనంత్‌నాగ్, పహల్గామ్ చుట్టు పక్కల ఉన్న అడవుల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ఐఏ అధికారులు అత్యాధునిక సాంకేతికతతో పహల్గామ్ అడవులను 3D మ్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రవాదులు కశ్మీర్‌లోని స్థానికులపై ఆధారపడకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలకు గతంలోనే సమాచారం అందింది. ఆహారంతో పాటు నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్టు తెలిసింది. కశ్మీర్‌లో ఎక్కువకాలం పాటు ఉండేందుకు వీలుగా అన్నిరకాల ఏర్పాట్లతో వచ్చినట్టు తమకు విశ్వసనీయ సమాచారం తమకు ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తాజాగా సెర్చ్ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. మరోవైపు భారత్ దాడి భయంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగుతోంది. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతో సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. కాగా, ఈ ఉద్రిక్తతలపై పాకిస్థాన్ క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరినట్లు తెలుస్తోంది. భారత్ చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేసినట్లు తెలిసింది.