- గతంలో సమిధలైన బిఆర్‌ఎస్ నేతల జాబితాలో కౌశిక్‌రెడ్డి చేరతారు
- బిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి
- కౌశిక్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
- బిఆర్‌ఎస్ చేతిలో ఎంతోమంది
- తెలంగాణ ఉద్యమకారులు మోసపోయారు
- బిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నాయకుల ఫైర్
ఎమ్మెల్యేలు పాడికౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కగా, కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని శుక్రవారం స్పీకర్‌ను కాంగ్రెస్ మహిళా నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కౌశిక్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు.
గతంలో టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అధికారం లేకపోవడంతో బిఆర్‌ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వారు ఆరోపించారు. గతంలో సమిధలైన బిఆర్‌ఎస్ నేతల జాబితాలో కౌశిక్‌రెడ్డి చేరతారని వారు ఎద్దేవా చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌లో ఉద్యమకారుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి పరిస్థితి చూశామని, ఆయన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి ఖర్చులు పెట్టించాక ఆయన టికెట్ అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బిఆర్‌ఎస్ చేతిలో ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు మోసపోయారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం విశేషం.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోరు: మంత్రి కోమటిరెడ్డి
చచ్చిన పార్టీని బ్రతికించడం కోసమే బిఆర్‌ఎస్ నాయకులు ఈ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెకపూడి గాంధీ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోరని ఆయన కామెంట్ చేశారు. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చి బిఆర్‌ఎస్ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అదే ఆ పార్టీ విధానమా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే బిఆర్‌ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా అని మంత్రి ధ్వజమెత్తారు. హైదరా బాద్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే బిఆర్‌ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. గురువారం జరిగిన ఘటనలో తాము తులుచుకుంటే బిఆర్‌ఎస్ ఉండేదా అని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలని మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద, ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలని, అవసరం అయితే రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
కౌశిక్‌రెడ్డిని బిఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే దానం
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కావాలనే ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా, లేక పార్టీ స్టాండా..? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ వ్యక్తిగతమే అయితే బిఆర్‌ఎస్ పార్టీని నుంచి ఆ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇళ్లే దొరికిందా అని ఆయన కామెంట్ చేశారు. కౌశిక్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లో ఉన్న అగ్రనేతలే రెచ్చగొడుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ శాసన సభ్యుడైన హరీశ్‌రావు కూడా ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని ఆయన హితవు పలికారు. చీర, గాజులు అంటూ కామెంట్ చేసిన కౌశిక్‌రెడ్డికి త్వరలోనే మహిళల శక్తి ఏమిటో చూపిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
మహిళలంటే బిఆర్‌ఎస్ నేతలకు గౌరవం లేదు: ఎమ్మెల్యే యెన్నం
హరీశ్‌రావు, కెటిఆర్‌ల మాయమాటలకు కౌశిక్ రెడ్డి బలవుతున్నారన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహిళలంటే బిఆర్‌ఎస్ నేతలకు గౌరవం లేదని ఆయన విమర్శించారు. కౌశిక్ రెడ్డి మాటల వెనుక బిఆర్‌ఎస్ పెద్దలు ఉన్నారని ఆయన చెప్పారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలన్న కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే యొన్నం పేర్కొన్నారు. సిఎం రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారని, తొమ్మిది నెలల్లో ప్రపంచంలో పేరుపొందిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయన్నారు. 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల
ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కెసిఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, బిఆర్‌ఎస్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోగానే బిఆర్‌ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని, ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నారు: మాజీ మేయర్ బొంతు
అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లిన మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వార్తల్లో నిలవాలన్న తాపత్రయంతో కౌశిక్ రెడ్డి ఇలా వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎంఎల్‌ఏ గాంధీ స్పందించారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు
కాంగ్రెస్ మహిళా నేతలు, కార్పొరేషన్‌ల చైర్ పర్సన్‌లు శుక్రవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిశారు. వారు కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల కౌశిక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బండ్రు శోభారాణి మాట్లాడుతూ మహిళలను కించపర్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఆంధ్ర వాళ్లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేకుంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
దాడులు సరికాదు: ఎంపి మల్లు రవి
తాజాగా కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ వివాదంపై కాంగ్రెస్ ఎంపి మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను గతంలో బిఆర్‌ఎస్‌లో చేర్చకున్న అంశాన్ని ఆయన గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని మల్లు రవి సెటైర్లు వేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలుంటే ప్రశ్నించాలని, దాడులు సరికాదని మల్లు రవి వ్యాఖ్యానించారు.
ధర్నాకు పిలుపునిచ్చిన ఆంధ్రా సెటిలర్లు
శుక్రవారం మియాపూర్ చౌరస్తాలో పలువురు ఆంధ్రా సెటిలర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. అరికెపూడి గాంధీకి మద్దతుగా ధర్నా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పలువురు నిర్ణయించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనకు అనుమతి లేదని ధర్నా చేయొద్దని పోలీసులు తెలిపారు. పోలీసుల సూచనతో సెటిలర్లు ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నారు.