Saturday, May 24, 2025

కవిత చెప్పిన దెయ్యం ఆయనే మంత్రి సీతక్క కౌంటర్

అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌‌కు లేదని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తున్న కవిత లేఖ, కేటీఆర్ కామెంట్స్‌పై మంత్రి సీతక్క స్పందించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని, కేటీఆర్‌కు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలన్నారు. కవిత అన్న దెయ్యం కేటీఆరే కావొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌‌కు లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రశంసల కోసమే… ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని తెలిపారు. యుద్ధంలో ట్రంప్ నీతిని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్‌కు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా అని నిలదీశారు. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడిదో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

కేటీఆర్‌కు మతి భ్రమించింది: టీపీసీసీ చీఫ్
మరోవైపు కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు అధికార దెయ్యం పట్టిందని.. కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారన్నారు. కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమిచిందంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖతో మతిభ్రమించిన కేటీఆర్‌.. సీఎం రేవంత్‌ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం స్కాంలో కేసీఆర్‌కు, హరీష్‌‌రావుకు నోటీసులు అందడంతో షాక్‌ తిన్న కేటీఆర్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. అధికార దెయ్యం పట్టిన కేటీఆర్ వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మూడు ముక్కలాటలో ఓ ముక్క కవిత విడిపోవడం ఖాయమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నట్లు బీఆర్ఎస్ నేతల మాటగా కవిత లేఖలో స్పష్టంగా చెప్పుకొచ్చారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌పై బీజేపీ నేతలు పొగడ్తలు, సానుభూతి తెలుపుతున్నారని అన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ మైత్రికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందన్నారు. పదేళ్ల పాలనలో కేటీఆర్ కుటుంబం చేసిన అవినీతి బయటపడుకుండా ఉండేందుకు నరేంద్ర మోదీ, అమిత్‌ షా కాళ్లు పట్టుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. లిక్కర్‌ స్కాంలో కవితకు బెయిల్‌ కోసం బీజేపీ కాళ్లు పట్టుకుంది ఎవరో కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో కోమటి రెడ్డి ఒక సీనియర్‌ మంత్రి అని… కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతా బాగుండడంతో తట్టుకోలేని కేటీఆర్‌ అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నారన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఈడీ కేసు బీజేపీ కక్షపూరితంగా కాంగ్రెస్‌పై సృష్టించిన కేసని.. కాంగ్రెస్‌ సొంత పత్రికకు ఆ పార్టీ వారు నిధులు ఇవ్వడం అవినీతి ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్‌ ఒప్పందాలు, ఫార్ములా రేస్‌ ఇలా ఒకటేమిటి బీఆర్‌ఎస్ అవినీతి జాబితాకు అంతే ఉండదన్నారు. బీఆర్‌ఎస్ చేసిన కాంట్రాక్టులు, దందాలు మరిచి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఒక వైపు కవిత, మరోవైపు కాళేశ్వరం కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేటీఆర్‌ ఎటూ పాలుపోక చివరికి మీడియాపై కూడా విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com