* కవిత కస్టడీ పొడిగింపు
* ఈడీ కేసులో జూలై 3 వరకు..
* సీబీఐ కేసులో ఈ నెల 7 వరకు జ్యూడిషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఆమెపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి అభియోగాలు మోపగా.. ప్రస్తుతం ఆమె తీహర్ జైలులో ఉన్నారు. సోమవారం ఈడీ మనీలాండరింగ్ కేసులో కస్డడీ ముగియగా.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె రిమాండ్‌ను పొడగించింది. ఇప్పటి వరకు 14 రోజుల పాటు మాత్రమే కస్టడీ పొడగించగా.. తాజాగా నెల రోజుల పాటు కస్టడీ పొడగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జులై 3 వరకు ఆమె కస్టడీని పొడగించారు.
ఇక సీబీఐ కేసులోనూ సోమవారంతో కవిత కస్టడీ ముగియగా రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ ఇచ్చింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.
ఇక, చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సప్లమెంటరీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో రూ.1100 కోట్ల వ్యాపారం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. రూ. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు చెప్పింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ పేర్కొంది. అయితే శరత్ చంద్రారెడ్డి A7, అమిత్ అరోరా A 14, అరుణ్ పిళ్ళై A26, మనీష్ సిసోడియా A 29, మాగుంట రాఘువరెడ్డి A18, మాగుంట కంపెనీ అగ్రో ఫోమ్స్ 19లను చార్జ్‌షీట్‌లో చేర్చింది. అయితే, మొదటగా సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో పాస్ పోర్టు సరెండర్ చేయాలంటూ నిందితులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చరణ్ ప్రీత్ కేసు విచారణను జులై 3వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మార్చి 15న ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఆమె పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా.. న్యాయస్థానం తిరస్కరించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే సీబీఐ, ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ వచ్చిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్లు తరిస్కరించింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని.. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని కవిత ఆరోపిస్తున్నారు.