కుటుంబ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత విభేదాలు మొదలుపెట్టారు. ఇప్పుడు కవిత ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి.. కొత్త పార్టీ పెడుతుందా.. లేదంటూ తమ ఇంటి పార్టీలోనే ఉంటూ వస్తుందా.. అనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. కేసీఆర్‌కు లేఖ రాసి, చాలా విమర్శలు చేసి ఇప్పటికి వారం గడిచింది. అటు బీఆర్‌ఎస్ నుంచి ఇంకా సైలెంట్‌గా ఉంది. కేసీఆర్ రియాక్షన్ లేదు. కేటీఆర్ కూడా ఏదో ఓ మాట అనేసి అమెరికా వెళ్లిపోయాడు. ఇక అప్పుడప్పుడు నేనే ట్రబుల్ షూటర్ అనుకునే హరీశ్‌రావు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పెడితే ఎవరికి ఎంత లాభం.. అసలు పార్టీ పెట్టేంత బలం ఉందా.. గతంలో కూడా ఇదే తరహా రాజకీయాల్లో షర్మిల కూడా పార్టీ పెట్టారు. త్వరగానే జెండా ఎత్తేశారు. ఇప్పుడు కవిత పార్టీతో ఎవరికి ఎంత ఉపయోగం అనేది కూడా ముందున్న ప్రశ్నే.
తాజాగా మైడియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ఇప్పుడు సంచనలమైంది. బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. అయితే బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్నది మాత్రం ఆమె లేఖ ద్వారానే బహిర్గతమైంది. అయితే ఇప్పటి వరకు దీనిపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నర్మగర్భంగా మాట్లాడటం మినహా అందరూ సైలంట్ గా ఉన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ నుంచి కవితకు ఎలాంటి పిలుపు రాలేదు. అయితే కేసీఆర్ దూతలుగా రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ లీగల్ సెల్ ఇంఛార్జి గండ్ర మోహన్ రావు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తన లేఖను బయటపెట్టిన వ్యక్తులెవరో తెల్చాలని, తన రాజకీయ భవిష్యత్తుపై హమీ ఏంటని, పార్టీలో తన స్థానం ఏంటని కవిత ప్రశ్నించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో నేరుగా చర్చించాలని తాను అనుకుంటున్నట్లు వారితో కవిత చెప్పినట్లు సమాచారం. రానున్న రోజుల్లో దీనిపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ ఈ విషయంలో ఆయన మౌనం దాల్చితే కవిత ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పడే చేప్పలేం. అయితే ఒక వేళ ఈ చర్చలు విఫలమై కవిత పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అసలు పార్టీ పెట్టే శక్తి కవితకు ఉందా? తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందా ? కవిత కొత్త పార్టీ పెడితే ఏ పార్టీ నష్టపోతుంది ?
కవితకు అంత ఉందా..?
తెలంగాణలో కేసీఆర్ కుమార్తెగా ప్రజలకు పరిచయం అయిన కవిత ఆ తర్వాత కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఉద్యమంలో, ఇటు రాజకీయాల్లో తనకుంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ కంటే రాజకీయ మేధావి.. రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కూడా షర్మిల ఇలాగే కొత్త పార్టీ పెట్టారు. కానీ, మధ్యలోనే కాడెత్తేశారు. ఇప్పుడు కవిత సామర్ధ్యాలపై ఓసారి పరిశీలిస్తే..!
కవితకు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అదే రీతిలో పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అలాంటి ఫాలోయింగ్ ను కవిత సంపాదించుకున్నారు. కొత్తగా తనను తాను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసుకోనక్కరలేని మంచి అవకాశం కవితకు ఉంది. ఇక, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఓ పార్టీ పెట్టడానికి మంచి బలాన్ని ఇచ్చే అంశంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్రకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ జాగృతి వంటి సంస్థను స్థాపించి, ఆ సంస్థతో తెలంగాణ భాష, సంస్కృతి, పండుగల పట్ల ప్రజల్లో ఓ చైతన్యాన్ని తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారు. ఈ సంస్థ ద్వారా తెలంగాణ ప్రజలో ఓ సంబంధాన్ని ఏర్పరుచుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ సెంటిమెంట్ ఏదో రూపంలో ఉపయోగపడుతుంది. కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు, ఉద్యమ కేసుల్లో ఉండంటం వంటి అంశాలు ప్రజలను దగ్గర చేసేందుకు ఉపయోగపడతాయి. పార్టీ ప్రారంభానికి ఇది ఓ ఉత్ప్రేరకంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
కవిత ఇప్పటికే అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ కొత్త పార్టీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని గ్రామ స్థాయి వరకు తెలంగాణ జాగృతి సంస్థను కవిత విస్తరింప జేశారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ అంతటా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లోను, విదేశాల్లోను జాగృతి శాఖలు ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టేందుకు ఈ బేస్ కవితకు బాగా లాభిస్తుంది. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసే లాంఛింగ్ సమస్యలు ఏవీ కవితకు వచ్చే అవకాశం లేదు. ఇలా తెలంగాణ జాగృతి సంస్థ కొత్త పార్టీ ఏర్పాటుకు లాంఛింగ్ పాడ్ లా ఉపయోగపడుతుంది. తెలంగాణలో ప్రజాకర్షణ గల మహిళా రాజకీయ నాయకుల కొరత ఉంది. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే శక్తి ఉన్న మహిళా నేతలు తెలంగాణలో లేరనే చెప్పాలి. ఈ లోటును కవిత పూడ్చే అవకాశం ఉంది. మహిళలను ఆకట్టుకునే నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాగృతి సంస్థ, మహిళా రిజర్వేషన్లపై చేసిన కార్యక్రమాలు, కవితకు ఉన్న రాజకీయ అనుభవం కొత్త పార్టీ పెట్టేందుకు కలిసి రావచ్చు. ఉద్యమ నాయకురాలిగా, పార్లమెంట్ సభ్యురాలిగా, శాసనమండలి సభ్యురాలిగా ఉన్న అనుభవం పార్టీ నడపడంలో కొంత బలాన్ని ఇస్తుంది. అంతే కాకుండా కేసీఆర్ కూతరు కావడంతో తన తండ్రి పార్టీని నడిపిన తీరు, సంక్షోభ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వాటి వల్ల వచ్చిన విజయాలు, ఓటములు దగ్గర నుంచి చూసిన అనుభవం కూడా కలిసి వస్తుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పట్ల విముఖత ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఓ కొత్త ప్రత్యామ్నాయాన్ని చూస్తుంటారు. అలాంటి సందర్భంలో కవిత పెట్టే పార్టీకి ఈ రాజకీయ పరిస్థితులు కొంత మేర కలిసి రావచ్చు. అలాంటి నేతలు కొత్త పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చేరికలు కొత్త పార్టీలో జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు.
సవాళ్లు ఎలా..?
తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ కుటుంబపై ఉన్న ప్రధాన ఆరోపణ కుటుంబ రాజకీయాలు అనే ముద్ర. బీఆర్ఎస్ నుంచి వీడి కొత్త పార్టీ పెట్టినా కవితకు ఆ ముద్ర తప్పదు. అటు విపక్షాలు, ప్రజల నుంచి వచ్చే రాజకీయ విమర్శలు కొత్త పార్టీ పెట్టే విషయంలో ప్రతికూలం కావచ్చు.
లిక్కర్ స్కాం ఆరోపణలు
లిక్కర్ స్కాంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో కవిత జైలుకు వెళ్లి రావడం ప్రధాన ప్రతికూలాంశంగా మారవచ్చు. అయితే కేసు నుంచి కవిత బయటపడే వరకు విపక్షాలు కవితను రాజకీయంగా వెనక్కు నెట్టే అస్త్రంగా లిక్కర్ స్కాం కేసును ఉపయోగిస్తాయనడంలో సందేహం లేదు. కొత్త పార్టీ పెట్టే వ్యక్తి రాజకీయ జీవితం మచ్చ లేనిదిగా ఉంటేనే పార్టీ నడపటం కష్టమైన ప్రస్తుత రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ఆరోపణలతో పార్టీని పెట్టి దాన్ని నడపడం కవితకు కత్తిమీద సామే అని చెప్పాలి.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు తెలంగాణలో రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, బీజేపీ క్రమ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ఉన్న తరుణం ఇది. బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ బహిరంగ సభను వరంగల్ లో నిర్వహించి ప్రజాకర్షణ శక్తి ఏ మాత్రం తమ చీఫ్ కేసీఆర్‌కు తగ్గలేదని నిరూపించుకుంది. ఈ ఉత్సాహంతో ముందుకు సాగుతుంది ఇలాంటి రాజకీయ వాతావరణంలో కవిత కొత్త పార్టీ పెడితే ప్రజల నుంచి అనుకున్న రీతిలో మద్ధత్తు వస్తుందని ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్‌కు నష్టం కలిగించడమే ప్రధాన లక్ష్యం అవుతుంది. ఆ పార్టీ ఓటర్లలోనే ఎక్కువ చీలిక వస్తుందన్నది నిజం. ఆ పార్టీలోని అసంతృప్త నేతలు, కార్యకర్తలు, ఓటర్లు కొద్ది మంది కవిత వైపు తిరగవచ్చు. కాని ఇది బీఆర్ఎస్‌కు, అటు కవితకు లాభం చేకూర్చేది కాకుండా కాంగ్రెస్, బీజేపీలకు లాభించే అవకాశం ఉంది. ఏ పార్టీ స్థాపించినా దానికో లక్ష్యం ఉంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాల వంటి పార్టీలు ఓ బలమైన కారణాలతో పురుడు పోసుకున్నవి . పక్క రాష్ట్రంలో తీసుకున్నాటీడీపీ , వైసీపీ ఆవిర్భావం వెనుక బలమైన ప్రజా లక్ష్యాలు ఉన్నాయి. అయితే కవిత పెట్టే కొత్త పార్టీ తనకు అన్యాయం జరిగిందని చెబితే ప్రజలు ఆమోదం తెలిపే స్థితిలో లేరు. ఓ బలమైన ప్రజల ఆకాంక్షలను లక్ష్యంగా పెట్టుకొని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి సెంటిమెంట్ ఉంటే తప్ప కొత్త పార్టీ నిలదొక్కుకునే పరిస్థితి ఉండదు.
నిధులు ఎలా..?
కొత్త రాజకీయ పార్టీ స్థాపన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నిధులు భారీగా అవసరం. కేసీఆర్ కుమార్తెగానో లేదా జాగృతి అధ్యక్షురాలిగానో నిధుల సేకరణ అంత సుళువుగా సాధ్యమయ్యే పని కాదు. కొత్త నాయకులను, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం కూడా అంత ఈజీగా జరిగే పని కాదు. అయితే అసంతృప్తితో ఉన్న కవిత కొత్త పార్టీ పెడుతారా లేకుంటే టీ కప్పులో తుపాను లా బీఆర్ఎస్ లో ఈ సంక్షోభం ముగియనుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే కొత్త పార్టీ స్థాపనకుపై అంశాలు ప్రభావితం చూపే అవకాశం మాత్రం ఉన్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది మాత్రం సాహసోపేతమైన చర్యగా చూడాల్సిందే. బీఆర్ఎస్‌లో డైనమిక్‌గానే కవిత వ్యవహార శైలి ఉంటుందని గులాబీ నేతలు చెబుతుంటారు. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కాగానే సైలంట్‌గా ఉండకుండా తన లేఖను బయపెట్టింది కేసీఆర్ చుట్టు ఉన్న దయ్యాలే అని, కోవర్టులే అని మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడటం ఇవన్నీ కవిత ఓ కచ్చిత నిర్ణయానికి వచ్చి చేస్తున్న చర్యలుగానే చూడాల్సి వస్తుంది. పార్టీలో తన స్థానం ఏంటో తెలుసుకునేందుకు ఈ రీతిలో కవిత స్పందన ఉందన్నది బీఆర్ఎస్ కీలక నేతల మాట. ఇనాళ్లు పార్టీలో ఉండి పని చేసిన తన లాంటి నేతను పక్కన పెడితే చూస్తూ తాను ఊర్కునే రకం కాదన్న హెచ్చరిక గత రెండు మూడు రోజుల పరిణామాలు చెబుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కేసీఆర్ లాంటి లెంజడరీ నాయకుడ్ని, కేటీఆర్, హరీశ్ రావు లాంటి రాజకీయ చతురత ఉన్న నేతలను కాదని కవిత తన రాజీకీయ భవిష్యత్తు కోసం పార్టీ పెట్టి వారికి ఎదురెళ్లుతుందా ? అంత సాహసం చేస్తుందా ? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో ఉంది.