Monday, July 1, 2024

ఫార్మ్ హౌస్, పాలెస్

తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ముఖ్య మంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా వంద వాట్స్ బల్బులాగా కాంతులీనారు. మేము మోనార్కులమన్నట్లుగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రజాస్యామ్యదేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్లుగా కాకుండా.. తాము దైవాంశ సంభుతులమని.. తమ జాతకంలో గజకేసర యోగం కదంతొక్కుతుందని.. అందుకే తమకు ఈ యోగం.. ఈ మహారాజ యోగం దక్కిందన్నట్లుగా మసులుకున్నారు. దాంతో ముఖ్యమంత్రులుగా వారు తీసుకున్న నిర్ణయాలతోపాటు.. వారు వ్యవహరించిన తీరు.. వారినే కాదు.. వారి పార్టీలను సైతం పుట్టిముంచి పారేశాయి.

లక్షలకు లక్షల రూపాయిల ప్రజాధనాన్ని కుమ్మరించి సలహాదారులను పెట్టుకున్నా.. వారు ఏం చెప్పారో.. వీరు ఏం విన్నారో. అయిదేళ్లు తిరిగే సరికి ఒకరు ఫామ్ హౌస్‌కి.. మరోకరు బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమై… పోయారు. వారే.. హల్లో బ్రదర్స్ ప్లస్ జాన్ జిగ్రి దోస్త్‌లు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు ఏక కాలంలో సీఎంలుగా వ్యవహరించడమే కాకుండా.. వీరి పాలనలో తెనుగుదేశాన్నీ దివాళా తీయించేశారని రాజకీయ విమర్శకులు తమదైన శైలిలో సోదాహరణగా వివరించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

kcr farm house

దాదాపు దశాబ్దం పాటు అంటే.. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా కేసీఆర్ వ్యవహరించారని వారు గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి ఏమో కానీ.. రాష్ట్రానికి గుండెకాయ అయిన సెక్రటేరియట్‌ వైపు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా తొంగి చూడలేదని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మీరు సెక్రటేరియట్‌కు ఎందుకు రావడం లేదంటే.. సీఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియటంటూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొత్త భాష్యం చెప్పుకొచ్చారని వివరించారు. అయితే మోనగాడు సిమెంట్‌తో కట్టినట్లుగా హైదరాబాద్ నడి బొడ్డున ఠీవీగా ఉండే పాత సెక్రటేరియట్‌ను కూలగొట్టి.. అదే స్థానంలో కొత్త సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ నిర్మించారన్నారు.

అలాగే రూ. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను సైతం నిర్మించారని తెలిపారు. అయితే మన భవిష్యత్తును ప్రకృతి ముందే పసిగడుతుందన్నట్లుగా.. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్‌‌ బీటలు వారిందని పేర్కొన్నారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయిని గుర్తు చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వీడి ఒక్కసారి కూడా బయటకు వచ్చిందే లేదని.. అలాగే ఆయన సీఎంగా ఉన్న ఈ దశాబ్ది కాలంలో తెలంగాణలో ఎటువంటి ఘోర ప్రమాదం జరిగినా.. వాటి వైపు ఆయన దృష్టి సారించింది లేదన్నారు. అలాగే ఈ ఘటనలతో బాధితులుగా మారిన వారిని ఆయన పరామర్శించిన దాఖలాలు సైతం లేవన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం అందుకోగానే.. కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి పరిమితమైపోయారని రాజకీయ విమర్శకులు ఈ సందర్భంగా వివరించారు.

ఇక జగన్ బాబు..

kcr and ys jagan story

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లి వైయస్ జగన్ పాదయాత్ర చేశారని.. ఆ క్రమంలో నేను విన్నాను.. నేను కన్నానంటూ హామీలు సైతం గుప్పించారని రాజకీయ విమర్శకులు గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాజన్న రాజ్యం తీసుకు వస్తానన్నారని చెప్పారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గంపగుత్తగా వైసీపీకి ఓట్లు గుద్దడంతో వైయస్ జగన్ అధికారమనే అందలమెక్కారని… ఆ కొద్ది రోజులకే ప్రజలకే కాదు.. ఆయన రక్త సంబంధికులకు సైతం వైయస్ జగన్ అందకుండా పోయారని వివరించారు. మరోవైపు ప్రతిపక్షనేతగా అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతిచ్చిన వైయస్ జగన్.. అధికారంలోకి రాగానే మాట తప్పడమే కాదు.. మడమ సైతం తప్పి రాజధాని అమరావతికి తొక్కి పెట్టి.. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారని గుర్తు చేశారు.

ఈ ఒక్క ప్రకటనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్.. తన గొయ్యి తానే తొవ్వుకున్నారని రాజకీయ విమర్శకులు సోదాహరణగా వివరించారు. ఇక ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఊసే ఈ అయిదేళ్లలో ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎత్త లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. ఇంకోవైపు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్.. ఈ అయిదేళ్లలో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. దీంతో అన్నీ వ్యవహారాలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డే స్పందించేవారన్నారు. ఇంకా చెప్పాలంటే షాడో సీఎంగా ఆయన వ్యవహరించడంతో.. సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్‌ను సజ్జలకు ప్రతిపక్షాలు తగిలించాయని రాజకీయ విమర్శకులు గుర్తు చేశారు.

ఇద్దరు ఇద్దరే..

ఇక ఈ ఇద్దరు ఇద్దరేనని వారు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైందని.. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కారు పార్టీలోని ఎమ్మెలంతా దాదాపుగా హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించేశారన్నారు. గులాబీ పార్టీ కేడర్ సైతం రేపోమాపో కాంగ్రెస్ పార్టీలోకి గుంపగుత్తగా వెళ్లి పోనుందనే ఓ ప్రచారం సైతం తెలంగాణలో వాయువేగంతో సాగుతుందని చెప్పారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని.. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ప్రతిపక్షనేతగా కేసీఆర్ హాజరవుతారా? హాజరై ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తారా? లేకుంటే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే బీఆర్ఎస్ బాస్ పరిమితమవుతారా? అని రాజకీయ విమర్శకులు ఓ విధమైన సందేహాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. ఆయన పార్టీ జస్ట్ 11 సీట్లు మాత్రమే గెలుచుకుందని వారు గుర్తు చేశారు. దీంతో మాజీ సీఎం, పార్టీ అధినేత వైయస్ జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసి… ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారని తెలిపారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి ఆయన లేఖ సైతం రాశారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించిందని.. మాజీ సీఎం వైయస్ జగన్‌కు ఫ్లోర్ లీడర్‌ హోదా మాత్రమే ఇస్తామని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో వైయస్ జగన్.. సైతం అసెంబ్లీ సమావేశాలకు హజరవుతారా? లేకుంటే.. బెంగళూరులోని తన 23 ఎకరాల్లో నిర్మించుకున్న ప్యాలెస్‌కే పరిమితమైపోతారా? అని రాజకీయ విమర్శకులు ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ అధినేత వైయస్ జగన్ బెంగళూరుకే పరిమితమైతే.. పార్టీలోని లీడరే కాదు.. కేడర్ సైతం హోల్‌సేల్‌గా పార్టీనీ వీడే అవకాశాలున్నాయని వారు తమదైన శైలిలో విశ్లేషణ చేశారు.

ఏదీ ఏమైనా..

ఏ గూటి పక్షలు ఆ గూటికే చేరతాయన్నట్లుగా వీరిద్దరు అధికారానికి దురమయ్యారని వారు పేర్కొన్నారు. ఎందుకంటే.. తెలంగాణలో కేసీఆర్.. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చక తన ఓటమికి తానే బాధ్యుడిగా మారారని వివరించారు. ఇక వైయస్ జగన్.. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఘోర ఓటమిని చవి చూశారని గుర్తు చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరు ఎన్ని చేసినా.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లని.. వారి తీర్పే ఫైనల్ అని.. వారు రాసే స్క్రిప్ట్‌కు భగవంతుడు సైతం అడ్డు చెప్పబోడని రాజకీయ విమర్శకులు తమదైన శైలిలో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular