మేడిగడ్డ అక్రమాలపై పిటిషన్ వేసిన రాజలింగం హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని చంపేశారన్నారు. గురువారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తో పాటు ఐదుగురిపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటీఆర్ హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెబుతోందని, గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్యలాగే ఇప్పుడు రాజలింగంను చంపేశారన్నారు. అడ్వకేట్ వామన రావు దంపతుల హత్యకు ఎవరు కారణమో అందరికీ తెలుసని, వరంగల్ లో ఎంపీడీఓను బీఆర్ఎస్ వాళ్లు హత్య చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారని గుర్తు చేశారు. కొడంగల్ లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశాడని, తెలంగాణలో అభివృద్ధి జరగొద్దనేది బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటున్నాడని.. మరి హత్యా రాజకీయాలు చేయడమే మీ గ్రాఫా? అని మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.