అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారు
ఫాంహౌస్ దాటని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది..?
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే తనకు పదేళ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్‌కు 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని విమర్శించారు. కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్ , ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారు. 14 నెలల నుంచి ఫాంహౌస్ దాటని ఆయన స్థానిక ఎన్నికలు వొస్తున్నాయని ప్రజల్లోకి వొచ్చే యత్నం చేస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గానీ, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వొచ్చినప్పుడు గాని ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదు.
శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీవర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కూడా కేసీఆర్ హాజరుకాలేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సైతం గైర్హాజరయ్యారు. తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేత అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. కానీ కేసీఆర్ తాను ప్రజలు జవాబుదారీగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు.
ఆయన అసెంబ్లీకి వొస్తే ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏవిధంగా తిరోగమన దిశలోకి తీసుకెళ్లారు, పదేళ్లలో ఆయన చేసిన నిర్వాకాలను తప్పులను ఒక్కోక్కటిగా సరిచేసుకుంటూ 14నెలల్లో తాము సాధించిన అభివృద్దిని సవివరంగా కేసీఆర్ ముందుంచుతాం. కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ తన భవిష్యత్, తన పార్టీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. కేసీఆర్ భవిష్యత్తుపై గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పార్లమెంటు తీర్పే భవిష్యత్‌లో ఉంటుంది. విపరీతమైన అప్పులు చేసి నెత్తినమీద మిత్తిల భారం పెట్టిపోయారు . పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఆయనను ఎన్నటికీ క్షమించదు. నువ్వు వద్దు, నీ పాలన వద్దూ మహాప్రభో అని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నా ఇంకా వదిలేది లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.