ప్రతిపక్ష హోదాలో తొలిసారి శాసనసభకు
ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం తొలిసారిగా అసెంబ్లీకి హాజరుకానున్నారు. రేపు సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఇక బడ్జెట్ పై ఇటు సీఎం రేవంత్ రెడ్డి పంచులు, అటు కేసీఆర్ సెటైర్లతో సభ రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. అయితే ఇదే అంశంపై అధికార పార్టీతో, ఇతర ప్రతిపక్షాలు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి సభకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ జరిగే చర్చలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం, విద్యుత కొనుగోళ్ల అంశాలపై సైతం కేసీఆర్ అసెంబ్లీ నుంచి క్లారిటీ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ హాజరైతే రేపటి నుంచి శాసనసభ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.