అసెంబ్లీకి రాకుండా ఎక్కడున్నారు..?
క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు
సాగు భూములకు సంక్రాంతి తర్వాత రైభు భరోసా
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అవుట్‌లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం పలు అంశాలపై మాట్లాడారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. సభ్యుల అభిప్రాయాలతో రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయాలి అనుకున్నామని, వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి సహాయం అని కేసీఆర్ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల రూ. 22,606 కోట్లు సాగు చేయని భూములకు రైతుబంధు అందిందని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేసిందని, సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, నేషనల్ హైవేస్ కు కూడా రైతు బంధు ఇచ్చారని, గతంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారి కూడా రైతు బంధు ఇచ్చారని, ఆమన్‌గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు కూడా ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా అని ప్రశ్నించారు.
దొంగ పాస్ పుస్తకాలతో రైతుబంధు
‘‘దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు తీసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులం అని వేల కోట్లు కొల్లగొట్టారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నాం. కొండలు, గుట్టలు, లే అవుట్లకు కూడా రైతు భరోసా ఇవ్వాలా. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు. మీరు కాదు మాకు ఆదర్శం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేము ఇక్కడ ఉండేవారం కాదు.. 2023లో ఓడి పోయారు, ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి. ఇకముందు ఊడ్చుకుపోతారు. వ్యవసాయ దారులు మాకు ఆదర్శం. బీఆర్ఎస్ చిత్ర, విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో మీ సూచనలు చెప్పండి. అబద్దాల సంఘం అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యల పై అబద్ధాలు చెబుతున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు శిక్ష
తాము అధికారంలోకి వచ్చే సమయంలోనే రూ.7,11,911 లక్షల కోట్ల అప్పులను ఇచ్చి వెళ్లారని, 60 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ. 72 వేల కోట్లే అని, తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. పదేండ్లు కష్టపడి.. ఇంజినీర్ అవతారమెత్తి కేసీఆర్ కూలేశ్వరం కట్టారని సెటైర్ వేశారు. ఒకేసారి రుణమాఫీ చేయలేమని కేసీఆర్ గతంలో చెప్పారని, ఒకేసారి రుణమాఫీ చేయాలంటే రూ.8 వేల కోట్లు కావాలన్నారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పాలన చేశారో బీఆర్‌ఎస్ వెనక్కి తిరిగి చూసుకోవాలని, బీఆర్‌ఎస్ చేసిన పాపాలు చదవాల్సిన శిక్ష తనకు వచ్చిందని సీఎం ఎద్దేవా చేశారు. స్కిల్ వర్సిటీ కోసం అదానీ రూ.100 కోట్లు ఇస్తే ప్రతిపక్షం నానాయాగీ చేసిందని, ప్రతిపక్షం యాగీ వల్ల రూ.100 కోట్లు అదానీకి తిరిగి ఇచ్చామని, రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తనకేం సొంతంగా జరిగే నష్టం ఏం లేదన్నారు.
రైతు ఆత్మహత్యల్లో భారతదేశం రెండో స్థానం
‘‘2014లో 898 మంది, 2015లో 1358, 2016లో 632 మంది మొత్తంగా 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుంచి16 మధ్య NCRB ప్రకారం రైతు ఆత్మహత్యల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. 2019లో డిసెంబర్‌లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం. ఇది అందరం తలదించుకునే విషయం. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓడినా మనుషులు మారలేదు. మాటలు మారడం లేదు. బీఆర్ఎస్ పాలనలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం జరిగిందో తెలుస్తుంది. వాళ్ల పదేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రూ.16, 909 వేల కోట్లు. మీరిచ్చింది వడ్డీకే సరిపోయింది. అసలు అలాగే ఉంది. రూ.21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది.’’ అని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.