- సీఎం సోదరులతో ఏం చేస్తున్నారో మాకంతా తెలుసు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందేమోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరని బ్యారేజీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. శనివారం బీఆర్‌ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రాబోయే రోజుల్లో బ్యారేజీకి ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఫలితమేనని భావించాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సబంధాలున్నాయో తమకు తెలుసు అని, వారు బ్యారేజీని ఏమైనా చేయగలరని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టును అడ్డం పెట్టుకొని నీళ్లు ఎత్తిపోయడం లేదని, ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడం సంతోషమేనన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలమైందన్నారు. శుక్రవారం తాము మేడిగడ్డను సందర్శించినప్పుడు పది లక్షల క్యూసెక్కుల వరద బ్యారేజీ గుండా ప్రవహిస్తోందన్నారు.
ఎన్‌డీఎస్‌ఏ కాదు.. ఎన్‌డీఏ రిపోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన రిపోర్టు ఎన్‌డీఎస్‌ఏది కాదని.. అది ఎన్‌డీఏ రిపోర్టు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అనేక విషయాల్లో విభేదించినా కాళేశ్వరంపై ఒకే వైఖరితో ఉన్నారని, మంత్రి ఉత్తమ్ ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ప్రకారం నడుచుకుంటామని చెప్తున్నారని, అంటే బీజేపీ చెప్పినట్టే నడుచుకుంటారని కేటీఆర్అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పుడు ఎన్‌డీఎస్‌ఏ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి నిన్న 90 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోయాయని, అంటే ఒక్క రోజులోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సమానమైన వరద మేడిగడ్డ నుంచి వెళ్లిందన్నారు. ప్రభుత్వ బేషజాలకు పోకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని కేటీఆర్ కోరారు. రిజర్వాయర్లన్నీ నింపడానికి ఎల్లంపల్లి నీళ్లు సరిపోవని, ఇప్పుడు ఎన్నికలు లేవు.. రాజకీయం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అనేది కరువును పారద్రోలే ఇన్సూరెన్స్ అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 40 శాతం లోటు వర్షపాతం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కన్నెపల్లి నుంచి నీళ్లు పంప్ చేయడం మినహా వేరే మార్గం లేదన్నారు. ఎత్తిపోతలకు కరెంట్ ఖర్చవుతుందని.. అలాగని రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఖర్చులను లెక్కిస్తారా అని ప్రశ్నించారు. గల్ఫ్ లో తాగునీటి కోసం ఎంత ఖర్చు పెడతారో తెలుసా అన్నారు. కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే డబ్బులు వృథా అయ్యాయని చెప్పేటోళ్లు.. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంటున్నారని, ఎవరికి లాభం చేయడానికి ఈ ప్రాజెక్టో చెప్పాలన్నారు. ఆగస్టు 2 తర్వాత పార్టీ చీఫ్ కేసీఆర్ తో చర్చించి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటి విడుదలకు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చని ఇంజనీర్లు చెప్పారని, తాము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చేసిన అభివృద్ధిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని, అందుకే ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని ఎంఐఎం ఒత్తిడి చేయడంతోనే అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినా ప్రతిపక్ష నేత మూడ్ నుంచి బయటికి రావడం లేదని, ఎల్ అండ్ టీ గురించి అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తీరు బాగా లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. ఎల్ అండ్ టీ ఏమైనా చిన్నాచితక కంపెనీయా అన్నారు. సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం సోదరులు ఏం చేస్తున్నారో మాకంతా తెలుసు
సీఎంకు అన్నింటిలోనూ స్కాంలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని, అందులో ఏం స్కాం ఉందని ప్రశ్నించారు. ఒక్క బతుకమ్మ చీరల పంపిణీ మాత్రమే కాదు, ఏ పథకంపైన అయినా ప్రభుత్వం విచారణ చేయించుకోవచ్చన్నారు. సీఎం అయి ఉండి రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్ తో పోలుస్తారా.. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా అన్నారు. షావలీ దర్గాపై తమ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కరెక్టేనని.. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి వెళ్తారా అని ప్రశ్నించారు. భూ సేకరణ సమస్యలు ఉండవని ఎయిర్ మెట్రో కారిడార్ ను రాయదుర్గం మార్గంలో ప్రాతిపాదించామే తప్ప అందులో ఇంకే ఆలోచన లేదన్నారు. పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలన్నారు. హైడ్రా కూడా అంతేనని అన్నారు. సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసని, అవసరమైనప్పుడు అన్నీ బయట పెడుతామన్నారు.
ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి ,అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారని అన్నారు. ధరణి స్థానంలో ఏది తెచ్చినా అది భూ మేతే అవుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు పని చేయాలనే తాము కోరుకుంటున్నామని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడుతారనే దానిపై ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మోటార్లకు మీటర్ల నిబంధనను కేంద్రం కరోనా సమయంలో తెచ్చిందని, ఉదయ్ స్కీం గురించి అసెంబ్లీలో పత్రం చూపించి అందులో మోటార్లకు మీటర్లు పెట్టే ఒప్పందం చేసుకున్నారని సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రోజూ తెలంగాణ భవన్ లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పేర్లు మార్చడం తప్ప చేసింది ఏమీ లేదని, హైడ్రా కూడా అంతేనని, సీఎం కు పేర్లు మార్చే పిచ్చి ఉందన్నారు. సీఎం సోదరులు కొండల్ రెడ్డీ ,తిరుపతి రెడ్డీ ఏం చేస్తున్నారో మాకంతా తెలుసని, అవసరమైనపుడు అన్నీ బయటపెడుతున్నామన్నారు.