ఒకే రోజు 90 శాతం బుకింగ్స్ రద్దు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లోని పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. భయంతో పర్యాటకులు తమ టికెట్లు, హోటల్ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నారు, ఒక రోజు కాలంలో 90% బుకింగ్స్ రద్దయినట్లు ట్రావెల్ సంస్థలు తెలిపారు. దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లోని పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు భయంతో వెనుదిరుగుతున్నారు. ఉగ్రదాడి జరిగిన తర్వాత కేవలం ఆరు గంటల్లోనే 3,337 మంది విమానాల్లో శ్రీనగర్‌ను వీడినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చామని, విమానాశ్రయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని తెలిపారు. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించామని, అన్ని సంస్థలు ఇప్పటికే టికెట్ల క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ చార్జీలను రద్దు చేశాయని వివరించారు. మరోవైపు త్వరలో కశ్మీర్‌లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నవారు.. తమ ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్స్ వంటివి రద్దు చేసుకుంటున్నారు. ఉగ్రదాడి జరిగాక ఒక్క రోజులోనే జమ్మూకశ్మీర్‌కు 90 శాతం బుకింగ్స్ రద్దయినట్టు ఢిల్లీలోని ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. మిగతావారు కూడా రద్దు చేయాలని కోరుతున్నారని ఢిల్లీ కన్నాట్‌ప్లే్‌సలోని స్వాన్ ట్రావెలర్స్ సంస్థ నిర్వాహకుడు గౌరవ్ రాఠీ పేర్కొన్నారు. జమ్మూకు, వైష్ణోదేవి ఆలయం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పర్యాటకులు భయపడుతున్నారని స్వస్తిక్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి కొత్త బుకింగ్స్ తీసుకోవద్దని శ్రీనగర్ ట్రావెల్ అసోసియేషన్ నుంచి సమాచారం వచ్చిందని ఏజే టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి వెల్లడించారు.
ఆరేళ్లలో తొలిసారి బంద్..
ఉగ్రదాడిని నిరసిస్తూ జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో బుధవారం బంద్ పాటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత బంద్ జరగడం ఇదే తొలిసారి. ముఖ్యంగా జమ్మూ నగరం, ఉధంపూర్, కత్రా, కథువా, సాంబ తదితర ప్రాంతాల్లో పూర్తిగా బంద్ పాటించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులతో ఉగ్రమూకల స్థావరాలపై దాడిచేసి పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే యుధ్‌వీర్ సేథీ డిమాండ్ చేశారు. ఇటీవల హమాస్ చేసిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ విరుచుకుపడిన స్థాయిలో.. పాకిస్థాన్‌కు భారత్ సమాధానం ఇవ్వాలని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్‌పీ వైద్ పేర్కొన్నారు. మరోవైపు బనిహాల్, రాజౌరీ, పూంఛ్, దోడా తదితర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ స్థానిక రాజకీయ పార్టీలు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పలు ముస్లిం సంస్థలు కూడా ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించాయి. ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ జమ్మూకశ్మీర్‌లోని పత్రికలు బుధవారం నాటి తమ సంచికల మొదటి పేజీలను నలుపు రంగుతో నింపేశాయి. ముష్కర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ నివాళి అర్పించాయి. కాగా, పర్యాటకులపై దాడికి పాల్పడినవారు మానవత్వం లేని జంతువులని, బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.