ఖతార్ రాజ కుటుంబం నుంచి విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా అందుకోనున్న విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ బహుమతిని స్వీకరించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఉచితంగా వస్తున్న ఖరీదైన విమానాన్ని కాదనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ బహుమతి ద్వారా ఖతార్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న వాదనలను, అలాగే భద్రతాపరమైన ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. “ఇలాంటి ప్రతిపాదనను నేను ఎప్పటికీ తిరస్కరించను. ఉచితంగా వస్తున్నప్పుడు వద్దనడానికి నేనేమైనా తెలివితక్కువవాడినా?” అని ఆయన ప్రశ్నించారు.
తన అధ్యక్ష పదవీకాలం ముగిశాక ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. దీనికి బదులుగా డబ్బు చెల్లించాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ విమానాన్ని అధ్యక్ష లైబ్రరీ ప్రదర్శనశాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు, విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఖతార్ ప్రతినిధి స్పందించారు. తాత్కాలికంగా ఒక విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చల్లో ఉందని తెలిపారు.